ఏపీ రాజకీయాల్లో వాడీవేడీ మాటలు చాలా సాధారణం. సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం దాటిపోయి వ్యక్తిగత దూషణల వరకూ కూడా వెళ్తుంటాయి. అదే విధంగా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడం కూడా కామన్. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. కొంచెమైనా మానవత్వం చూపించండి జగన్ గారూ.. చంద్రబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. పింఛన్ తొలగించారనే కారణంతో ఓ అంధురాలు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగింపు కర్కశత్వం. ఆమె ఆత్మహత్య అత్యంత హృదయవిదారకమంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కొంచెం మానవత్వం చూపండి జగన్ గారూ..మాటల్లో కాదు చేతల్లో.. అంటూ సీఎం వైఎస్ జగన్‌ను ట్యాగ్ చేశారు.
పింఛన్ తొలగించారనే కారణంతో అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కనదొడ్డి తండాకు చెందిన సరోజమ్మ అనే మహిళ శనివారం ఆత్మహత్య చేసుకుంది. నక్కనదొడ్డి తండాకు చెందిన లక్ష్మీ దేవమ్మ, సోమ్లా నాయక్ దంపతులకు సరోజమ్మతో పాటుగా, మరో ముగ్గురు కుమారులు సంతానం. పెద్దకుమార్తె అయిన సరోజమ్మ పుట్టుకతోనే అంధురాలు. చెవులు కూడా వినిపించవు. తండ్రి ఏడేళ్ల కిందట చనిపోవటంతో తల్లీ, తమ్ముళ్లతో కలిసి జీవిస్తోంది. అయితే ఏళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్న సరోజమ్మకు ఇటీవలే పింఛన్ తొలగించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. సరోజమ్మ తమ్ముడికి రైల్వేలోఉద్యోగం రావడంతో సరోజమ్మకు పింఛన్ తొలగించారని తెలిపారు. కుటుంబం అంతా ఒకే రేషన్ కార్డులో ఉండటంతోనే పింఛన్ తొలగించినట్లు చెప్పారు.
అయితే.. ఏడాది కిందట పింఛన్ తొలగించగా అప్పటి నుంచి అధికారులను ఎన్నోసార్లు కలిసి అభ్యర్థించినట్లు సరోజమ్మ కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా అధికారులు పట్టించుకోకపోవటంతో శనివారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వివాహ వేడుక కోసం తామంతా వేరే ఊరికి వెళ్లామన్న కుటుంబ సభ్యులు.. అంతలోనే ఈ ఘోరం జరిగిందని వాపోయారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు.. ఆంక్షల పేరుతో అంధురాలి పింఛన్ తొలగించడం అన్యాయమంటూ ట్వీట్ చేశారు. మానవత్వం చూపండి జగన్ గారూ అంటూ అందులో పేర్కొన్నారు.