పార్వతీపురం జిల్లా పాలకొండలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. దిశ ఎస్సైతోపాటు కానిస్టేబుల్ ఇంట్లో దొంగతనం చేశారు. శుక్రవారం రాత్రి పాలకొండలోని మూడు ఇళ్లలో దొంగతనాలు జరగ్గా.. అందులో రెండు పోలీసులవి కావడం గమనార్హం. పైగా ఆ ఇళ్లు డీఎస్పీ ఆఫీసుకు చేరువగా ఉండటం విశేషం. దిశ పోలీసు స్టేషన్ ఎస్సై లావణ్య పాలకొండ డీఎస్పీ ఆఫీసుకు సమీపంలోనే నివాసం ఉంటున్నారు. శుక్రవారం పార్వతీపురం వెళ్లిన ఆమె.. ఆ రాత్రి జిల్లా కేంద్రంలోనే ఉండిపోయారు. ఆమె తల్లి సైతం ఊరెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు.. చోరీకి పాల్పడ్డారు. తెల్లవారాక ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగింటి వారు ఎస్సైకి సమాచారం ఇచ్చారు. ఎస్సై ఇంట్లో నుంచి రూ.30 వేలు క్యాష్, తులం బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.
ఎస్సై లావణ్య ఇంటికి సమీపంలోని కానిస్టేబుల్ ఇంట్లోకి కూడా దొంగలు ప్రవేశించారు. కానీ వారి ఇంట్లో డబ్బులు, బంగారం లాంటివేమీ కనిపించకపోవడంతో వెళ్లిపోయారు. పక్క వీధిలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. పంచాయతీరాజ్ శాఖలో పని చేసే కాంతారావు కుటుంబం కాశీకి వెళ్లగా.. ఇంటి వెనుక వైపు నుంచి దొంగలు చొరబడి... రూ.1.60 లక్షల నగదు, 8 గ్రాముల బంగారాన్ని మాయం చేశారు. పోలీసుల ఇంట్లో దొంగతనం జరిగిందనే వార్తతో పాలకొండ వాసులు ఉలిక్కి పడ్డారు. పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ వారు చర్చించుకున్నారు. డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారి ఇళ్లలో దొంగతనం జరగడాన్ని పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకోవడానికి పోలీసులు శ్రమిస్తున్నారు.