తెలంగాణ రాజకీయాల గురించి ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ గానీ, అధినేత చంద్రబాబు కానీ ఎలాంటి జోక్యం చేసుకోలేదని తెలిపారు. గాంధీభవన్‌లో టీడీపీ జెండాలు కనిపిస్తే తమకేం సంబంధం అని ప్రశ్నించారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశం మీద కూడా బుద్ధా వెంకన్న క్లారిటీ ఇచ్చారు. విజయవాడ వెస్ట్ నుంచి పోటీచేస్తానని స్పష్టం చేశారు. బీసీ అభ్యర్థిగా అక్కడి నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేతను కోరారు. టీడీపీ అధిష్ఠానం తనకుసీటు ఇవ్వకుంటే తనవద్ద ఆప్షన్ బీ కూడా రెడీగా ఉందని బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఆడుదాం ఆంధ్రా పేరుతో వైసీపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితే ఈసారి ఏకంగా డబ్ల్యు, డబ్ల్యు ఎఫ్ పోటీలు పెడతారంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు తమ అధినేత గురించి ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని వైసీపీ నేతలకు బుద్ధా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. అందుకు తగిన రీతిలో సమాధానం ఇస్తామన్న బుద్ధా వెంకన్న.. వైసీపీ నేతలను ముఖ్యమంత్రి కంట్రోల్ చేయాలని సూచించారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలవరని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణతో పాటు, ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో.. టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బీఆర్ఎస్ ఓడిపోయి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో.. టీడీపీ శ్రేణులు సెలబ్రేట్ చేసుకున్నాయి. తమ అధినేతకు శిష్యుడైన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు సంబరపడ్డాయి. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసం టీడీపీ పరోక్షంగా సహకరించిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ తీరుపై వైసీపీ శ్రేణులు ఆరోపణలు గుప్పించాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని తెలుగుదేశం కార్యకర్తలు సంబరపడుతున్నారని విమర్శించాయి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గాంధీభవన్‌లో టీడీపీ గెంతులేంటని సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలోనే నాని వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న కౌంటర్ వేశారు.