ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా.. 25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 18వ తేదీన దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. ఆ మరుసటి రోజు నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయనున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకూ 1,059 రకాల చికిత్సలు అందిస్తుండగా.. ఈ మొత్తాన్ని 3,257కి పెంచారు. ఇదే సమయంలో చికిత్సకు అయ్యే ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిధిని ఏపీ సర్కారు 25 లక్షలకు పెంచాలని నిర్ణయించింది.
మరోవైపు దేశంలో 25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని చెప్పొచ్చు. ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో కూడా పార్టీలన్నీ పేదలకు పదిలక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తాయని హామీ ఇచ్చాయి. తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ కూడా ఎన్నికల సమయంలో ఇదే హామీని ఇచ్చింది. గెలిచిన తర్వాత అమలు చేస్తోంది. అయితే 25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. ఆరోగ్యశ్రీ కింద పెంచిన సేవలు, కొత్త కార్డులకు సంబంధించి డిసెంబర్ 18వతేదీన వైద్యారోగ్యశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేయనుంది.అదే రోజు ఏపీవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, సీహెచ్‌వో, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లనుద్దేశించి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. 19వతేదీ నుంచి1.42 కోట్ల కుటుంబాలకు కొత్తఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తారు.మరోవైపు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా ఇంటివద్ద కోలుకుంటున్న రోగులకు సైతం ఏపీ ప్రభుత్వం ఐదువేల వరకూ సాయం అందిస్తోంది.