ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బరేలీ జిల్లాలోని భోజిపురా హైవేపై శనివారం రాత్రి ఓ కారు, ట్రక్కు ఢీకొన్నాయి. ప్రమాదం ధాటికి కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అందులోనే సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. పెళ్లికి హాజరైన ఓ కుటుంబం తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టినట్లు బరేలీ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ సుశీల్ చంద్ర భాన్ ధులే వెల్లడించారు. ఈ ఘటన తర్వాత ట్రక్కు డ్రైవర్ పరారైనట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారు సెంట్రల్ లాక్ పడటంతో అందులో ఉన్నవారు బయటకు రాలేకపోయారని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదం ధాటికి కారు, ట్రక్కు రెండు దగ్ధం అయ్యాయి. బరేలీ నుంచి బహెడి వైపు నైనిటాల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై టైర్ గుర్తులను చూస్తే.. ట్రక్కులో ఇరుక్కుపోయి రోడ్డుపై దాదాపు 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తోంది. ఇక కారు డోర్లు లాక్ కావడంతో అందులో నుంచి బయటికి రాకుండా వారు చిక్కుకుపోయినట్లు గుర్తించారు. స్థానికులు ఇచ్చి సమాచారం మేరకు 4 వాహనాల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు, ట్రక్కుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. బహేరీలోని రాంలీలా మొహల్లాలో నివాసముంటున్న సుమిత్ గుప్తాకు చెందినదని కారు నంబర్ ప్లేట్ ఆధారంగా తేలింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే సరికి కారులో సీట్లపై అస్థిపంజరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో పరిస్థితిని చూసి అధికారులు, ప్రత్యక్ష సాక్షులు నిశ్చేష్ఠులయ్యారు.