వంశధార రిజర్వాయర్ తో శివారుకు సాగు నీరు అందిస్తామని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ..వ్యవసాయం కోసం ఏమీ తెలియని రాజకీయ పార్టీల నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా గొప్పగా ఏపీ ప్రభుత్వం రైతులను ఆదుకుంటోంది. అక్కున చేర్చుకుంటోంది. పంట ప్రారంభంలో విత్తనాల పంపిణీ దగ్గర నుంచి పంట చేతికి వచ్చినంత వరకూ ప్రభుత్వమే అన్ని విధాల సాగుదారులకు తోడుగా ఉంటోంది. ఈ విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే పాలన ఉంది. ఇవాళ ఎక్కడైనా విత్తనం,ఎరువు అందలేదు అనే వార్త చూశారా అని ప్రశ్నిస్తున్నా ? రైతుల మేలు కోరి సచివాలయం,ఆర్బీకే వ్యవస్థలు తీసుకు వచ్చాం. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. చిన్నా,పెద్దా అన్న తేడా లేకుండా అందరి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకూ ప్రాధాన్యం ఇచ్చి,వాటికి నిధులు కేటాయించి పూర్తి చేస్తున్నాం. టీడీపీ అధికారంలో ఉన్నంత వరకూ వ్యవసాయం రంగంలో ఉత్పత్తి - 6.5 శాతం ఉంటే..ఈ రోజు ఉత్పత్తి + 5.56 శాతం ఉంది. విపక్ష నేత చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్న చూపు. ఒక సందర్భంలో వ్యవసాయం దండగ అని అన్నారు. దేశంలో 65 శాతం ప్రజలు వ్యవసాయ రంగం ఆధారితంగానే జీవిస్తున్నారు. వైఎస్ఆర్ హయాంలో ఆ రోజు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్ ఇస్తాం అంటే..చంద్రబాబు హేళన చేస్తూ..మాట్లాడారు. సకాలంలో విద్యుత్ అందదని,కరెంటు తీగలపై బట్టలు ఆరబెట్టి కోవాలి అని అన్నారు. అనాలోచిత విమర్శలు చేశారు. చంద్రబాబు ఫక్తు వ్యాపార దృక్పథం కలిగిన వ్యక్తి. రైతుల విషయంలో ఆయన ఏనాడూ ఏమీ చేసిన దాఖలాలు లేవు. అలానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఏ రోజైనా ఇచ్చిన మాటకు కట్టబడి ఉన్నారా ? రైతులకు ఏ రోజైనా తోడుగా ఉన్నారా..? అని ప్రశ్నించారు.