ఓటమి భయంతోనే రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సీఎం జగన్ రెడ్డి రాజకీయ బదిలీలకు తెరతీశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ - జనసేన కాంబినేషన్‌తో జగన్ రెడ్డి ఎన్నికలకు మూడు నెలల ముందే చేతులెత్తేశారన్నారు. ఒక నియోజకవర్గంలో చెల్లని కాసులు మరో నియోజకవర్గంలో ఎలా చెల్లుతాయి జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. చిలకలూరి పేటలో జనానికి నచ్చనివారు గుంటూరు పశ్చిమంలో ఎలా గెలుస్తారని అడిగారు. పెడన ప్రజలు ఛీ కొట్టిన వ్యక్తి, మరో నియోజకవర్గంలో ఎలా ప్రజాభిమానం పొందుతారని నిలదీశారు. వైసీపీలో ఇప్పుడు 11 వికెట్లే పడ్డాయని.. 2024 జనవరికి ఆ పార్టీ దివాళా బోర్డు పెట్టడం ఖాయమన్నారు. జగన్ రెడ్డి విచ్చలవిడి అవినీతి, అహంకారమే తమకు శాపంగా మారాయని వైసీపీ ఎమ్మెల్యేలు బావురుమంటున్నారన్నారు. స్వతంత్రభారత చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి రానంత వ్యతిరేకత నాలుగున్నరేళ్లలో వైసీపీకి వచ్చిందని అన్నారు. ఇంత తక్కువ సమయంలో జగన్ రెడ్డి, అతని పార్టీ కుప్పకూలి పోతుందని ఎవరూ అనుకొని ఉండరన్నారు. సగం మందికిపైగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలో మంత్రిగా ఉన్న వ్యక్తే కుటుంబంతో సహా టీడీపీలోకి వస్తానంటున్నారన్నారు. చంద్రబాబు కనుసైగ చేస్తే ఇప్పటికిప్పుడు 40 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతారన్నారు. జగన్ రెడ్డి చేయించిన అన్నిసర్వేలు తన పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదని తేల్చాయన్నారు.