మనబడి నాడు - నేడులో భారీగా అవినీతి చోటు చేసుకుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 6321 కోట్ల రూపాయలు నాడు- నేడుకు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందన్నారు. సంవత్సరంలో పూర్తి చేస్తామని నాడు-నేడు ప్రారంభించి 27 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదన్నారు. నాడు-నేడు మాటల్లో తప్పా చేతల్లో అమలు కాలేదని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నాడు-నేడుపై చెప్పిన హామీలు మొత్తం ఆచరణలో అమలు కాలేదన్నారు. నాడు - నేడు కోసం తెచ్చిన రూ.6321కోట్లలో రూ.3747 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఖర్చు పెట్టారన్నారు. నాడు-నేడు కోసం తెచ్చిన మిగతా డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్ళాయని ప్రశ్నించారు. రూ.4409 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందని.. రూ.1855 కోట్లు దుర్వినియోగం అయ్యాయని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. అమ్మఒడి డబ్బులను స్కూల్ మెయిన్టెయిన్ కోసం ఖర్చు చేస్తున్నారన్నారు. కాంట్రాక్టుర్లకు బిల్లులు ఇవ్వడం తేదని.. తెచ్చిన అప్పులు మొత్తం ఏమయ్యాయని నిలదీశారు. సమగ్ర శిక్ష కింద వస్తున్న నిధులు ఏమయ్యాయన్నారు. నాడు - నేడు నిధులు వేరే శాఖలకు మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కూల్స్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.