తమిళనాడులో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులపై దాడి వ్యవహారం కలకలంరేపింది. తిరుచ్చి శ్రీరంగంలో ఉన్న రంగనాథస్వామి ఆలయంలో స్వామి దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్న భక్తులకు, ఆలయ భద్రత సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆ గొడవతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. అయ్యప్ప భక్తులపై భద్రతా సిబ్బంది దాడి చేశారు.. చేతికి అందిన వస్తువులతో కొట్టడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులు పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ఏపీ భక్తులను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆలయంలో స్వామివారి దర్శనం కోసం వస్తే.. భద్రతా సిబ్బంది దాడి చేయడంపై భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆలయంలో ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ఏపీ భక్తులు క్యూలైన్ లోనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. భక్తులు ఆలయ భద్రతా సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపు స్వామి వారి దర్శనాన్ని నిలిపివేశారు. స్థానిక పోలీసులు ఆలయంలోకి వచ్చి భక్తులకు సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. ఏపీ భక్తులు భద్రతా సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలతో పాటు ఏపీ భక్తుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది.. ఆలయంలో ఏపీకి చెందిన భక్తులు గోవింద, గోవింద అంటూ నినాదాలు చేయడంతోనే అక్కడి భద్రతా సిబ్బంది దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై తమిళనాడు అధికారులు స్పందించాల్సి ఉంది.