మా లక్ష్యం నేరవేరిన తర్వాత గాజాలోని హమాస్‌పై చేస్తోన్న యుద్ధాన్ని ఆపేస్తామని ఇజ్రాయేల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలంట్ పునరుద్ఘాటించారు. ఉత్తర గాజాలోని హమాస్‌కు చెందిన జబాలియా, షెజాయాలు నిర్వీర్యం అంచున ఉన్నాయని తెలిపారు. ఇజ్రాయేల్ రక్షణ మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘మా లక్ష్యాలకు చేరుకోగానే యుద్ధం ముగుస్తుంది.. నేను అమెరికా అడిగే, చెప్పే ప్రతిదాన్ని పరిగణనలోకి తీసుకుంటాను.. అమెరికా చేస్తున్న పనిని మంత్రివర్గంలోని సభ్యులందరితో పాటు తీవ్రంగా పరిగణిస్తాను.. అమెరికన్లు మాకు సహాయం చేయడానికి మేము ఒక మార్గాన్ని కనుగొంటాం’ అని అన్నారు.
హమాస్‌తో బందీల విడుదలపై కొత్త ఒప్పందం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ.. ఒకవేళ ఇజ్రాయేల్ సైనిక ఒత్తిడిని పెంచితే బందీల విడుదలపై మరిన్ని ఒప్పందాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ‘మేము సైనిక ఒత్తిడిని పెంచినట్లయితే మరిన్ని ఒప్పందాలకు ఆఫర్లు వస్తాయని నేను నమ్ముతున్నాను.. ఆ ఆఫర్లు వస్తే మేము వాటిని పరిశీలిస్తాం’ అని చెప్పారు. జబాలియా, షెజాయాలోని హమాస్ కోటలను ఇజ్రాయేల్ దళాలు చుట్టుముట్టాయని గాలంట్ చెప్పారు. ఇటీవలి రోజుల్లో వందలాది మంది హమాస్ కార్యకర్తలు ఇజ్రాయేల్ దళాలకు లొంగిపోయారని, ఇది ఉగ్రవాద బృందానికి ఏమి జరుగుతుందో అర్ధమవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘మేము జబాలియా, షెజాయాలోని హమాస్ చివరి కోటలను చుట్టుముట్టాం.. మాతో పోరాటానికి సంవత్సరాలుగా సిద్ధం చేసి అజేయంగా పరిగణించిన ఈ బెటాలియన్లు కూల్చివేత అంచున ఉన్నాయి.’ అని ఆయన తెలిపారు.
ఎవరు లొంగిపోతారో వారి ప్రాణాలకు ఎటువంటి హాని ఉండదని పేర్కొన్నారు. ఐడీఎఫ్ అరెస్టు చేసిన వారిలో అక్టోబర్ 7 న జరిగిన మారణకాండలో పాల్గొన్న ఉగ్రవాదులు కూడా ఉన్నారని చెప్పారు. వారు మాకు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారని ఆయన అన్నారు. హమాస్ అధినేత యాహ్యా సిన్వార్‌ని కూడా ఆయన హెచ్చరించారు. ‘హమాస్‌లోని ఇతర సీనియర్ కమాండర్‌లు, కార్యకర్తల ముందున్నది రెండే దారులు.. లొంగిపోవడం లేదా చావడం.. మూడో ఆప్షన్ లేదు’ అని చెప్పారు. ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్, షిన్ బెట్ గత నెలలో గాజా స్ట్రిప్‌లో 500 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఐడీఎఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ యూనిట్ 504 మందిని విచారణ కోసం తీసుకెళ్లాయి. కాల్పుల విరమణ ముగిసిన అనంతరం డిసెంబరు 1 నుంచి ఇప్పటి వరకూ 140 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నాయి.