వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసేందుకు సొంత పార్టీలో నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందువరసలో ఉండగా.. ఆ తర్వాత భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కూడా ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వివేక్ రామస్వామికి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. వివేక్ రామస్వామితోపాటు ఆయన నిర్వహించిన ఎన్నికల ఈవెంట్‌లో పాల్గొనే ప్రతీ ఒక్కరినీ చంపేస్తానని సందేశం రావడం సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానితుడిని అరెస్ట్ చేశారు.
అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ రామస్వామి ప్రచారంలో భాగంగా రాబోయే డిబేట్లు, ఈవెంట్లకు సంబంధించి ఓటర్లకు నోటిఫికేషన్లు పంపించారు. అయితే ఈ నోటిఫికేషన్లకు రిప్లై ఇచ్చిన ఓ అజ్ఞాత వ్యక్తి వివేక్ రామస్వామిని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. రాబోయే ఈవెంట్లు తనకు మంచి అవకాశాన్ని కల్పించబోతున్నాయని.. ఆ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ చంపేస్తానంటూ ఆ వ్యక్తి తన రిప్లైలో పేర్కొన్నాడు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. న్యూహాంప్‌షైర్‌లోని డోవర్ నుంచి ఈ మెసేజ్‌లు వచ్చినట్లు గుర్తించారు. దీంతో మరింత లోతైన దర్యాప్తు జరిపిన పోలీసులు.. టైలర్ అండర్సన్ అనే 30 ఏళ్ల వ్యక్తి.. వివేక్ రామస్వామికి బెదిరింపు మెసేజ్‌లు పంపించినట్లు గుర్తించారు. దీంతో అతడ్ని అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ కేసులో టైలర్ అండర్సన్‌పై నేరం రుజువైతే.. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తనను చంపేస్తామని బెదిరింపులు రావడం పట్ల వివేక్ రామస్వామి స్పందించారు. ఆ మెసేజ్ చూసి వేగంగా స్పందించి నిందితుడిని అరెస్టు చేసినందుకు దర్యాప్తు సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. తన చుట్టూ ఉండి తనను రక్షించిన తన టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతీయ అమెరికన్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామితో పాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డి శాంటిస్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీలు పోటీలో ఉన్నారు. ఈ రేసులో 60 శాతం రిపబ్లికన్ ఓటర్ల మద్దతుతో డొనాల్డ్ ట్రంప్ అగ్రగామిగా ఉండగా.. రెండో స్థానంలో వివేక్ రామస్వామి కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.