ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలులో అదృశ్యం అయిన పుతిన్ ప్రత్యర్థి నావల్నీ.. ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా

international |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2023, 10:15 PM

వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రత్యర్థిగా ఉన్న అలెక్సీ నావల్నీ కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న అలెక్సీ నావల్నీ.. జైలులోనే అదృశ్యం కావడం సంచలనంగా మారింది. జైలులో ఉన్న అలెక్సీ నావల్నీని సంప్రదించేందుకు తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇక జైలు నుంచి అలెక్సీ నావల్నీ వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉన్నా.. టెక్నికల్ సమస్య కారణంగా అది కుదరలేదని జైలు అధికారులు కోర్టుకు చెప్పడం ఈ కేసులో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.


సోమవారం నావల్నీ వర్చువల్‌గా కోర్టులో హాజరుకావాల్సి ఉండగా.. జైలులో ఎలక్ట్రిసిటీ సమస్య వల్ల ఆయన్ను హాజరుపర్చలేమని అధికారులు కోర్టుకు విన్నవించారు. అయితే రష్యాలో పుతిన్‌ విధానాలను తీవ్రస్థాయిలో విమర్శించే నాయకుడు అలెక్సీ నవానీ జైలు నుంచి అదృశ్యం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. 2024 లో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరిపేందుకు రంగం సిద్ధమైన తరుణంలో ఈ పరిణామం వెలుగులోకి రావడం గమనార్హం. రష్యాలో అవినీతి వ్యతిరేక ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ప్రతిపపక్ష నేత అలెక్సీ నావల్నీకి ఈ ఏడాది ఆగస్టులో జైలు శిక్ష పడింది. ఫౌండేషన్‌ కార్యకలాపాల విషయంలో నమోదైన కేసులో స్థానిక కోర్టు 19 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అనంతరం అలెక్సీ నావల్నీని రష్యా రాజధాని మాస్కోకు 150 మైళ్ల దూరంలో ఉన్న పీనల్ కాలనీ జైలులో ఉంచినట్లు తెలుస్తోంది. నావల్నీని కలిసేందుకు ప్రయత్నించగా.. తమకు జైలు నుంచి ఎలాంటి సమచారం అందలేదని నావల్నీ తరఫు లాయర్లు సోషల్‌ మీడియాలో తెలిపారు. గత 6 రోజులుగా నావల్నీ ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. అయితే గతవారం నావల్నీ జైలుగదిలో అనారోగ్యానికి గురయ్యారని.. అప్పటినుంచి ఆయన కనిపించడం లేదని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో కనీస వసతులు కూడా అందడం లేదని ఆరోపించారు.


ఇక అలెక్సీ నావల్నీ జైలు నుంచి అదృశ్యం అయ్యారన్న ఘటనకు సంబంధించిన విషయం తెలిసి అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మిస్సింగ్‌ కథనాలపై అమెరికా ఆందోళనను వ్యక్తం చేసింది. వెంటనే అలెక్సీ నావల్నీని జైలు నుంచి విడుదల చేయాలని రష్యాకు సూచించింది. రష్యాలో ఉన్న అమెరికా దౌత్యకార్యాలయం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ పార్టీ నేతగా ఉన్న అలెక్సీ నావల్నీ.. ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టారు. రష్యా అధ్యక్ష భవనానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. గత అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడంతో ఆయన పేరు మారుమోగింది. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లిన నావల్నీపై విష ప్రయోగం జరిగింది. 5 నెలలు జర్మనీలో చికిత్స పొందిన నావల్నీ తిరిగి.. 2021 జనవరిలో తిరిగి రష్యాకు చేరుకోగానే ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్టు చేశారు. నవాల్నీ జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలతో తీసిన నవానీ డాక్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఆస్కార్ దక్కింది. 2024 మార్చి 17 వ తేదీన రష్యా అధ్యక్ష ఎన్నికలను నిర్వహించాలని అక్కడి చట్టసభ సభ్యులు నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. 2 దశాబ్దాలకుపైగా అధికారంలో కొనసాగుతూ ఎదురులేని నేతగా నిలిచిన పుతిన్‌ 2036 వరకు ఆ పదవిలో ఉండేందుకు ఇదివరకే మార్గం సుగమం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com