శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలను నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. ఏళ్ల తరబడి నుంచి చాపకింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిస్తోంది. ఇక్కడున్న జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే 15వేల మంది చనిపోయినట్లు అంచనా. ఒక అంచనా ప్రకారం.. జిల్లాలో 112 గ్రామాలు కిడ్నీ బారినపడి విలవిల్లాడుతున్నాయి. సాధారణంగా రక్తంలో సీరం క్రియాటిన్ 1.2 మిల్లీగ్రామ్/డెసీలీటర్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ సరిగా పనిచేయడంలేదని అర్థం.కానీ, ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటిన్ లెవెల్స్ చాలామందిలో 25 మిల్లీగ్రామ్/డెసీలీటర్ మేరకు ఉంది. క్రియాటినిన్ 5 దాటితే డయాలసిస్ తప్పనిసరి. ఇటువంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతుంది. వీరంతా విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. వారానికి రెండుసార్లు కూడా వెళ్లేవారున్నారు. ఇలా రోజుకు 500కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రవాణా, వైద్య ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. ఎంతోమంది డబ్బుల్లేక, వైద్యం చేసుకోలేక ప్రాణాలను కోల్పోయేవారు. మరోవైపు.. ఈ మహమ్మారిని పాలకులెవరూ పట్టించుకోలేదు. ఏళ్లుగా ఇక్కడి బీల నేలలో తెగిపడిన తాళిబొట్లు ఏ నేతనూ కదిలించలేదు. హామీలిచ్చిన వారు కొందరు, అన్నీ చేసేశామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు. ఇలాంటి ఆపత్కాలంలో ప్రతిపక్షనేత హోదాలో జగన్ కిడ్నీ బాధితులకు సాంత్వన చేకూర్చే కబురు చెప్పారు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆపన్నహస్తం అందిస్తున్నారు. డబ్బుల్లేక అల్లాడుతున్న అభాగ్యులకు నెలనెలా చేతిలో రూ.10వేలు పెడుతున్నారు. ఎక్కడో ఉన్న వంశధారను ఉద్దానానికి తీసుకొచ్చారు. తగ్గిపోతున్న ఉద్దానం ఆయష్షు రేఖకు ఊపిరిలూదుతున్నారు. అంతేకాదు.. రూ. వందల కోట్లతో మంచినీటి ప్రాజెక్టును.. కిడ్నీ పరిశోధనా ఆస్పత్రిని ఏర్పాటుచేశారు.