అనకాపల్లి జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌ను మత్స్యకారులు, గీత కార్మికులు, కొబ్బరి పీచు కార్మికులు, ఎన్‌ఏవోబీ నిర్వాసితులు కలిసి వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకున్ననది తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. వేట నిషేధ కాలంలో ఇచ్చే పరిహారం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదన్నారు. మత్స్యకారులకు పనిముట్లు, బోట్లను సబ్సిడీపై టీడీపీ ఇస్తే, వైసీపీ రద్దు చేసిందన్నారు. చంద్రన్న బీమా ద్వారా మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన పారిశ్రామికవేత్తలు, కార్మికులకు గొడ్డలివేటుగా పరిణమించిందన్నారు. టీడీపీ పాలనలో కొత్త పరిశ్రమలు వస్తే... జగన్ పాలనలో ఉన్న పరిశ్రమలను పక్కనున్న రాష్ట్రాలకు తరిమేస్తున్నారని అన్నారు. కొబ్బరిపీచు పరిశ్రమను కుటీరపరిశ్రమగా గుర్తించి కరెంటు ఛార్జీలు, మినిమం ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు చేపడతామన్నారు. కంటెయినర్ ఛార్జీల విషయంలో పోర్టు యాజమాన్యాలతో మాట్లాడి తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నేవీ అధికారులతో మాట్లాడి మత్స్యకార వృత్తికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిషింగ్ హార్బర్ నిర్మించి మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చట్టాలకు లోబడి పీఎఎఫ్, పీడీఎఫ్ గ్రామాలకు పరిహారం అందిస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మత్స్యకార సొసైటీ భూములకు తగిన విధంగా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.