మంత్రి విడదల రజిని చేసిన అవినీతి, దుర్మార్గాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. టీడీపీ రాష్ట్ర బృందంతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. మానుకొండవారిపాలెంలో శనగ, మిరప, వరి కల్లాలు పరిశీలించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ...‘‘మిచౌంగ్ తుఫాన్ కారణంగా మొత్తం 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జాతీయ విపత్తుగా ప్రకటించి అన్నదాతలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదుకోవాలి. కాలికి మట్టి అంటకుండా తిరిగితే రైతుల సమస్యలు సీఎం జగన్‌రెడ్డికి ఎలా తెలుస్తాయి. చెల్లని రూపాయి ఎక్కడికి వెళ్లినా చెల్లదు. స్థానాలు మార్చినంత మాత్రానా వాళ్ల అవినీతి, అక్రమాలు చెరిగిపోవు. వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టినా వారికి ఘోర పరాభవం తప్పదు. అభ్యర్థులను మార్చినంత మాత్రానా జనం నమ్ముతారు అనుకుంటే జగన్ భ్రమే అవుతుంది. జగన్, మంత్రులు, ఎమ్మెల్యేల నిర్వాకాలను ప్రజలు మరిచిపోలేరు. క్షమించలేరు’’ అని పుల్లారావు తెలిపారు.