ఏలూరు జిల్లాలో భార్యాభర్తల ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెంలో ఈ ఘటన జరిగింది. విశ్వనాద్రిపాలెంకు చెందిన పరసా నాగబాబుకు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన అనూషతో 2015లో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో పైకప్పునకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. పక్కింట్లో నివాసం ఉంటున్న నాగబాబు తల్లి వెంకటరమణ కూలిపనికి వెళ్లి వచ్చి మంగళవారం సాయంత్రం మినప్పప్పు కోసం వెళ్లి చూడగా భార్యాభర్తలు వేలాడుతూ కనిపించారు.
వెంటనే స్థానికులు కిందకు దించి.. ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే చనిపోయారు. స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లిదండ్రులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి ఆ చిన్నారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. వీరు సూసైడ్ లేఖ కూడా రాశారు. తల్లిదండ్రులు తమను క్షమించాలని.. తాము బతకడం ఇష్టం లేదన్నారు. అప్పు తీర్చాక చనిపోదాం అనుకున్నామని.. కానీ అసహ్యంగా అనిపించి చనిపోతున్నామన్నారు. పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని.. ఇద్దరి కిడ్నీలు ఎవరికైనా పనికొస్తే ఇచ్చేయమని కోరారు. తమ ఇద్దరి వల్ల ఎవరూ గొడవ పడొద్దని.. తమ అంతట తామే చనిపోతున్నామన్నారు. ఎవరి మీదా కోపంతో కాదని.. బంధువులకు ఇవ్వాల్సిన రూ.5 వేల బాకీ, బీరువాలో ఉన్న రూ.50 వేల డబ్బులు, మూడు నెలల్లో పూర్తవుతున్న బండి ఈఎంఐ, బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము గురించి ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.
నాగబాబు గ్రామంలోనే రొయ్యలు సాగు చేశారు. ఈ ఏడాది జూన్‌తో చెరువు లీజు పూర్తవగా సుమారు రూ.10 లక్షల మేర అప్పులపాలయ్యారని చెబుతున్నారు. అప్పులు తీర్చేందుకు భార్య నగలు సైతం తాకట్టు పెట్టారు. తండ్రి కొంత అప్పు తీర్చినా ఇంకా ఉంది.. రొయ్యల సాగుతో నష్టపోయిన నాగబాబు, దానిని విరమించుకొని సింగరాయపాలెంలోని ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నారు. అలాగే మూడు నెలల క్రితం భార్యతో ఇంటి వద్దే సోడా బండి కూడా పెట్టించారు. ఇంతలోనే ప్రాణాలు తీసుకోవడం విషాదాన్ని నింపింది.