తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ ప్రభావం ఏపీ మీద కూడా పడినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ 11 నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చడమే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. తెలంగాణ ఎన్నికల సమయంలో సిట్టింగ్‌ల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయం తెలిసినప్పటికీ.. గులాబీ బాస్ కేసీఆర్ అలాగే ముందుకెళ్లారు. ఫలితంగా అనూహ్య రీతిలో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందుజాగ్రత్త చర్యలకు దిగినట్లు తెలిసింది. మొత్తం 50 నుంచి 60 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడమో, లేదా కొత్తవారిని బరిలో నిలిపే ఆలోచనలోనో వైసీపీ ఉన్నట్లు తెలిసింది. అయితే.. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత విషయంలో వైసీపీ అధినేత జగన్ తీసుకున్నది సాహసోపేతమైన నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చిన క్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న సుచరితను తాడికొండ ఇంఛార్జిగా నియమించారు.అయితే ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి.. బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన స్థానం నుంచి తాడికొండ లాంటి ప్రత్యేక నియోజకవర్గానికి సుచరితను మార్చడం చాలా సాహసంతో తీసుకున్న నిర్ణయమని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే తాడికొండ నియోజకవర్గం అమరావతి పరిధిలో ఉంది. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి అమరావతిలో రైతులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజవర్గం నుంచి వైసీపీ గెలుపొందడం అంత తేలికైన విషయం కాదని విశ్లేషకుల అంచనా. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానంలో వైసీపీ, టీడీపీ మధ్య గట్టిపోటీ తప్పదని భావిస్తున్నారు. ఇదే సమయంలో 2019 ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి గెలుపొందిన ఉండవల్లి శ్రీదేవి ఇప్పుడు టీడీపీ పక్షాన చేరారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ గాలి వీచిన 2019 ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీ అభ్యర్థి స్వల్ప మెజారిటీతోనే విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసిన తెనాలి శ్రవణ్ కుమార్ మీద కేవలం నాలుగువేల ఓట్ల మెజారిటీతో ఉండవల్లి శ్రీదేవి గెలుపొందారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. అమరావతి ఉద్యమం కారణంగా స్థానికంగా వైసీపీ మీద కాస్త వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడుసార్లు గెలిచిన ప్రత్తిపాడును కాదని.. సుచరిత తాడికొండలో పోటీచేయడం సాహసమనే చెప్పాలి.
మరోవైపు తాడికొండ నుంచి తాను పోటీచేస్తానని సుచరిత స్వయంగా సీఎం జగన్‌ను కోరినట్లు తెలిసింది. తాడికొండ నియోజకవర్గం వ్యాప్తంగా తనకున్న బంధుగణం, సన్నిహితులు కారణంగా అక్కడి నుంచి పోటీచేసేందుకు సుచరిత మొగ్గుచూపినట్లు సమాచారం. 2009లో ఎమ్మెల్యేగా సుచరిత ప్రస్థానం మొదలైంది. అప్పటి ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి సుచరిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2011లో వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు.2012లో ప్రత్తిపాడులో జరిగిన ఉపఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుచరిత.. 2014 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు.