ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా నాన్నను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు: ఎమ్మెల్సీ సాబ్జీ కుమారుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2023, 10:50 PM

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతిపై కుటుంబసభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘మా నాన్నను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. మా నాన్న కూర్చున్న వైపే ఢీకొట్టారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయి’ అని సాబ్జీ కుమారుడు అన్నారు. ‘మా తమ్ముడి మరణం ప్రమాదం కాదు, ప్లాన్ చేసి చంపారు. మా తమ్ముడిపై కక్ష గట్టారు’ అని ఎమ్మెల్సీ సాబ్జీ సోదరుడు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సాబ్జీని హత్య చేసేంత కక్ష ఎవరికి ఉంది? అసలేం జరిగింది? అని ఆయన అభిమానులు ఆరా తీస్తున్నారు. ప్రమాస్థలిని ఉండి ఏఎస్సై సూర్యనారాయణ, ఎంపీడీవో కొండలరావు, ఇతర అధికారులు పరిశీలించారు.


ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును.. ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ సమీపంలో శుక్రవారం (డిసెంబర్ 15) ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భీమవరంలో అంగన్వాడీ కార్యకర్తలు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆ కార్యక్రమానికి హాజరై వారికి మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్సీ సాబ్జీ.. ఏలూరు నుంచి తన వాహనంలో బయల్దేరారు. భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌, సాబ్జీ గన్‌మెన్‌, ఆయన పీఏ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో భీమవరం ఆసుపత్రికి తరలించారు.


సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ సాబ్జీ మరణవార్త తెలిసింది. దీంతో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం క్యాబినెట్ భేటీ కొనసాగింది.


చివరి ఘడియల్లోనూ ప్రజాసేవలోనే: చంద్రబాబు


ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ‘అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపి.. అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోవడం విచారకరం’ అని చంద్రబాబు అన్నారు. సాబ్జీ తన చివరి ఘడియల్లోనూ ప్రజాసేవలోనే గడిపారని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్టు చేశారు.


సాబ్జీ ప్రస్థానం..


ఉపాధ్యాయుడైన సాబ్జీ ఐదేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే రాజీనామా చేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. 2019 ఫిబ్రవరిలో సీపీఎస్‌ రద్దు కోరుతూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఏలూరు నుంచి విజయవాడ వరకు నిర్వహించిన పాదయాత్రకు నాయకత్వం వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1966లో షేక్‌ కబీర్షా, షేక్‌ సైదాబాబి దంపతులకు సాబ్జీ జన్మించారు. ఆయన తండ్రి, తాత, ముత్తాత కూడా టీచర్లే కావడం గమనార్హం. సాబ్జీ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఏలూరు మండలం మాదేపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సమయంలో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com