పని ప్రదేశంలో సీనియర్ల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నానని, తనను ఆత్మహత్యకు అనుమతించాలని కోరుతూ ఓ మహిళా న్యాయమూర్తి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగంగా లేఖ రాయడం కలకలం రేగుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే ఈ వ్యవహారంపై నివేదికను అందజేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. బాధిత న్యాయమూర్తి రాసిన లేఖ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
యూపీలోని బాందా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా సివిల్ జడ్జి తన లేఖలో ‘సామాన్యులకు న్యాయం చేసేందుకు న్యాయ వృత్తిలో చేరిన నేను.. ఇప్పుడు అదే న్యాయం కోసం ప్రతి తలుపు తట్టాల్సి వస్తోంది.. గత కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. రాత్రి పూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా కలవమంటున్నారు.. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన లేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
‘లైంగిక వేధింపుల అంశాన్ని ఈ ఏడాది జులైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లాను. కానీ, ఎలాంటి ఉపయోగం లేదు. ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా న్యాయమూర్తి కింద పనిచేసేవారే.. వాళ్లు తమ బాస్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలరని నేను ఎలా నమ్మగలను? అందుకే దర్యాప్తు పూర్తయ్యేంత వరకు సదరు న్యాయమూర్తిని బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశా. కానీ, సెకన్ల వ్యవధిలో నా అభ్యర్థనను తిరస్కరించారు. ఏడాదిన్నరగా నేనో జీవచ్ఛవంలా బతుకుతున్నా.. బతికుండి ప్రయోజనం లేదు.. గౌరవప్రదంగా చనిపోయేందుకు నాకు అనుమతినివ్వండి’ అంటూ ఆమె వాపోయారు.
ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీజేఐ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన జస్టిస్ చంద్రచూడ్ చర్యలు చేపట్టారు. తక్షణమే తనకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్‌ను ఆదేశించారు. దీంతో ఆ మహిళా జడ్జ్ ఫిర్యాదు, దానిపై విచారణకు సంబంధించిన మొత్తం వివరాలను సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కుర్హేకర్ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినట్లు గురువారం రాత్రి సెక్రటరీ జనరల్ ఫోన్‌లో సమాచారం అందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. న్యాయమూర్తికే ఇలా జరిగితే.. సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు.