ప్రస్తుతం రూ.2,750గా ఉన్న వైయస్ఆర్ పింఛన్ కానుకను జనవరి 1వ తేదీ నుంచి రూ.3 వేలకు పెంచాలని నిర్ణయించింది. తద్వారా 65.33 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, చర్మకారులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు మరింత ఆర్థిక భరోసా కల్పిస్తోంది. గత సర్కారు హయాంలో పింఛన్ల కోసం నెలకు రూ.400 కోట్లు మాత్రమే వ్యయం చేయగా ఇప్పుడు తాజా పెంపుతో పింఛన్ల వ్యయం నెలకు రూ.2 వేల కోట్లకు పెరగనుంది. ఈ మేరకు శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. ఈ నేపథ్యంలో జనవరిలో సంక్రాంతికి తోడు పేదల ఇంట సంక్షేమ పథకాల పండగ సందడి చేయనుంది. జనవరి 10వతేదీ నుంచి 23వరకు చివరి విడత వైయస్ఆర్ ఆసరా, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు వైయస్ఆర్ చేయూత కార్యక్రమాలను అమలు చేయనున్నారు. సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.