టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర ఏ తుపానులోగానీ, కరోనా సమయంలోగానీ కనిపించారా అని పేర్ని నాని ప్రశ్నించారు. తాను, తన కుమారుడు పేర్ని కిట్టు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి కరోనా బారినపడిన ప్రజలను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశామని గుర్తుచేశారు. ఏ పరికరం కావాలన్నా సొంత డబ్బుతో తెప్పించి ప్రాణనష్టం జరగకుండా చూశామన్నారు. తుపాను హెచ్చరికల నుంచి చివరివరకు ప్రాణనష్టం జరగకుండా మోకాలులోతు నీటిలో పేర్ని కిట్టు తిరిగారని తెలిపారు. ముక్కుపచ్చలారని యువకుడు ప్రజల కోసం తిరుగుతుంటే కొల్లు రవీంద్ర సిగ్గుపడాలన్నారు. తాము సీటు వస్తే ఏంటి రాకపోతే ఏంటి అనే ఆలోచనతో పార్టీ కోసం ఉంటామని చెప్పారు. వైయస్ జగన్ బాగుంటే చాలు రాష్ట్రమంతా బాగుంటుందనే తమ కుటుంబమంతా ఆలోచిస్తుందని ఆయన పేర్కొన్నారు.