ప్రజారోగ్య పరిరక్షణలో మరో విప్లవాత్మక నిర్ణయానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ లభించింది. పేద కుటుంబాలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న అపర సంజీవని వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వైద్యశాలల్లో కార్పొరేట్ వైద్యాన్ని అందించడంతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అధునాతన వైద్య సేవలు పొందేలా ఆరోగ్యశ్రీని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం బలోపేతం చేయడం తెలిసిందే. ఇప్పటికే క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన బాధితులకు పరిమితి లేని చికిత్సలు అందిస్తూ ఆరోగ్యశ్రీ సంజీవనిగా మారింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చడంతో రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీతో లబ్ధి పొందుతున్నాయి. నాలుగున్నరేళ్లలో 37.40 లక్షల మంది ఆరోగ్యాలకు భరోసానిస్తూ వివిధ జబ్బుల చికిత్సకు 53,02,816 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం రూ.11,859.86 కోట్లు ఖర్చు చేసింది. గతంలో సుస్తీ చేస్తే వైద్య ఖర్చులకు కుటుంబాలు అప్పుల పాలై పేదలు జీవన ప్రమాణాలు క్షీణించేవి. అలాంటి దుస్థితి ఏ ఒక్కరికీ రాకూడదనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ వైద్య పరిమితి, ప్రొసీజర్లను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మరోవైపు గత ఎన్నికల్లో చెప్పిన మాటను తు.చ. తప్పకుండా ఆచరిస్తూ మేనిఫెస్టోలో పేర్కొన్న మరో హామీని సంపూర్ణంగా నెరవేరుస్తూ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది.