అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాతి స్థానంలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఉన్నారు. ఈ క్రమంలోనే రిపబ్లికన్ల మద్దతు పొందేందుకు వివేక్ రామస్వామి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విస్తృతంగా డిబేట్లలో పాల్గొంటూ తన మద్దతును కూడగట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.
తాను హిందువునని.. పొలిటికల్ కెరీర్ కోసం మతం మారబోనని ఇండియన్ - అమెరికన్ వివేక్ రామస్వామి స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న వివేక్ రామస్వామిని.. హిందూ నేతను అమెరికా అధ్యక్షుడిగా అంగీకరిస్తుందా అని మీడియా ప్రశ్నించారు. తాను హిందువుని అని.. రాజకీయాలు, పదవుల కోసం హిందూ మతం మారనని తేల్చి చెప్పారు. హిందూ మతం, క్రైస్తవ మతం ఉమ్మడి విలువలు కలిగి ఉంటాయని వివేక్ రామస్వామి.. తాను రాజకీయంగా జీవితంలో ఎదగాలనుకుంటే మతం మార్చుకోవచ్చు కానీ తాను అలా చేయబోనని పేర్కొన్నారు. తాను తాత్కాలిక అవసరాలు.. అధ్యక్ష ఎన్నికల కోసం నకిలీ మత మార్పిడి చేయనని పేర్కొన్నారు. హిందూ మతాన్ని తాను విశ్వసిస్తాని.. ఈ సందర్భంగా తన విశ్వాసం గురించి చెబుతున్నట్లు ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
మరోవైపు.. ఇటీవల వివేక్ రామస్వామికి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. వివేక్ రామస్వామితోపాటు ఆయన నిర్వహించే ఎన్నికల డిబేట్‌కు హాజరైన ప్రతీ ఒక్కరినీ చంపేస్తానని ఓ అజ్ఞాత వ్యక్తి మెసేజ్ పంపించడం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానితుడిని అరెస్ట్ చేశారు. న్యూహాంప్‌షైర్‌లోని డోవర్ నుంచి ఈ బెదిరింపు మెసేజ్‌లు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు 30 ఏళ్ల టైలర్ అండర్సన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నేరం రుజువైతే.. టైలర్ అండర్సన్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.