వైద్యపరంగా చనిపోయినట్లు ప్రకటించిన ఓ మహిళ దాదాపు అరగంట తర్వాత మేల్కొడంతో వైద్యులు విస్మయం వ్యక్తం చేశారు. వైద్యశాస్తంలో అరుదైన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. చావు అంచులకు వెళ్లొచ్చిన లౌరెన్ కెనడే అనే మహిళ తన ఈ అనుభవాన్ని ఆన్‌లైన్ వేదిక రెడిట్‌లో పంచుకుంది. హృదయ స్పందనలు ఆగిపోవడంతో వైద్యపరంగా తాను చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారని లౌరెన్ కెనడే తెలిపారు. అయితే, 24 నిమిషాల తర్వాత తాను స్పృహలోకి వచ్చానని, మేల్కొన్న తర్వాత గత జ్ఞాపకశక్తిని కోల్పోయానని చెప్పారు. ‘ఆస్క్ మీ ఏనీథింగ్’సెషన్‌లో లౌరెన్ మాట్లాడుతూ.. గుండెపోటుకు గురైన తనను వెంటనే ఆసుపత్రికి తరలించారని, మేల్కొనడానికి ముందు రెండు రోజులు కోమాలో ఉన్నానని తెలిపింది. అయితే, ఆస్పత్రికి వెళ్లడానికి ముందు భర్త తనకు ముందుగానే సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలు దక్కాయన్న ఆమె.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు, ఆయనే ఎల్లప్పుడూ తన హీరోగా ఉంటాడని చెప్పింది.
‘నేను గత ఫిబ్రవరిలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాను.. నా భర్త 911కి కాల్ చేసి ఆ వెటనే సీపీఆర్ ని ప్రారంభించారు... ఆస్పత్రిలో చేరిన తర్వాత 9 రోజుల ఐసీయూలో ఉన్నాను..హృదయ స్పందనలు నిలిచిపోయాయి.. ఎంఆర్ఐలో మెదడు దెబ్బతిన్నట్టు కనిపించలేదు..మస్తిష్కం సంకేతాలు నిలిచిపోయాయి’ కెనడే రెడ్డిట్ పోస్ట్‌లో తెలిపారు. గుండెపోటుతో కుప్పకూలిపోయిన వెంటనే ఏం జరిగింది? ఎటువంటి పరీక్షలు చేశారు? అని పలువురు ఆమెను ప్రశ్నించారు. ‘నా భర్త 4 నిమిషాల పాటు సీపీఆర్ చేశారు.. దానిని ఎలా చేయాలో వైద్యుడు చెప్పారు.. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ సీపీఆర్ చేయలేదు.. అదృష్టవశాత్తూ మేము ఫైర్ స్టేషన్‌కు దగ్గరలో ఉన్నాం.. ఆస్పత్రికి 4 నిమిషాల్లో చేరుకున్నాం’ ఆమె తెలిపారు. కోవిడ్ సమస్యల కారణంగా తన గుండె ఆగిపోయిందని, వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చిందని చెప్పారు.
వైద్యపరంగా కెనడే లాజరస్ ప్రభావం లేదా స్వీయ పునరుజ్జీవనాన్ని అనుభవించింది. ఈ అరుదైన దృగ్విషయం కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్లు ప్రకటించిన వ్యక్తిలో అకస్మాత్తుగా మళ్లీ జీవ సంకేతాలు మొదలైనప్పుడు సంభవిస్తుంది. వాస్తవంగా ఇది చనిపోవడం కాదు.. కానీ, బాధితులకు తాము మరణించి తిరిగి ప్రాణాలతో వచ్చామనే భావన కలుగుతుంది. అయితే, కెనడే కేసు చాలా ఆశ్చర్యకరంగా ఉందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఎందుకంటే ఇలా బయటపడ్డ చాలా మంది ఎక్కువ కాలం జీవించరు. 1982 నుంచి 2018 మధ్య నమోదైన 65 కేసుల్లో 18 మంది మాత్రమే పూర్తిగా కోలుకున్నారు. కాగా, కెనడేకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశం అత్యంత ప్రశాంతగా ఉన్న అనుభూతి. కోమా నుంచి మేల్కొన్న తర్వాత కొన్ని వారాల పాటు తాను ఎంతో ప్రశాంతంగా ఉన్నానని ఆమె చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa