ఉత్తరాంధ్రలో యువగళం పాదయాత్ర చేపడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను పంచ గ్రామాల ప్రజలు కలిశారు. పెందుర్తి నియోజకవర్గంలోని పరవాడ సంతబయలు వద్ద పంచ గ్రామాల ప్రజలతో లోకేశ్ ముఖాముఖి సమావేశం అయ్యారు. ఆయా గ్రామాల ప్రజల బాధలను ఎంతో సహనంతో విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పంచ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని స్పష్టం చేశారు. దీనివల్ల లక్ష మంది ఇబ్బంది పడుతున్నారని, కనీసం పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం కోసం ఆస్తులు అమ్ముకునే వీల్లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. చివరికి ఇంటికి మరమ్మతులు కూడా చేయించుకోవడం సాధ్యం కాని పరిస్థితుల్లో పంచ గ్రామాల ప్రజలు జీవిస్తున్నారని వెల్లడించారు.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జీవో నెం.578 తీసుకువచ్చి ఈ భూములను క్రమబద్ధం చేయాలని భావించినా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డు తగిలారని లోకేశ్ ఆరోపించారు. ప్రజలెవరూ డబ్బులు కట్టొద్దు... నేను అధికారంలోకి వచ్చి ఉచితంగా క్రమబద్ధీకరిస్తానని అక్కడి ప్రజలతో వైఎస్ చెప్పారని ఆరోపించారు. కానీ వైఎస్ అధికారంలోకి వచ్చాక ఓ కమిటీ వేశారని, దాంతో సమస్య మరింత సంక్లిష్టంగా మారిందని లోకేశ్ వివరించారు. కాగా, పంచ గ్రామాల సమస్యలపై తీసుకువచ్చిన జీవో నెం.229 కూడా ముందుకు కదలడంలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెం.229 అమలు చేసి, సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ న్యాయ విభాగంలో పనిచేసేవారు కోర్టుకు వెళ్లి జీవో నెం.229 అమలును అడ్డుకున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ కూడా ఎన్నికల ముందు... సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి, గెలిచాక చేతులెత్తేశాడని లోకేశ్ ఆరోపించారు. గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం కమిటీ పేరుతో కాలయాపన చేసిందని మండిపడ్డారు.