డాక్టర్ వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీని ప్రతి పేదవాడికి మరింత చేరువ చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదనే తాపత్రయంతో గతంలో ఎప్పుడూ, ఎవరూ చూడనంతగా మార్పులు తీసుకువచ్చాం. ఉచిత వైద్యం పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం.. దేశ చరిత్రలోనే మనందరి ప్రభుత్వ నిర్ణయం ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని, కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ ఉచిత సేవలను ఎలా వినియోగించుకోవాలనే సందేహాలను ప్రజాప్రతినిధులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. ప్రతి ఇంట్లో ఆరోగ్యశ్రీ యాప్‌తో పాటు దిశ యాప్ కూడా ఇన్‌స్టాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి సీఎం వైయస్ జగన్ సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ, అవగాహన కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు.