అయ్యప్ప మాల ధరించారని ఓ ఇద్దరు విద్యార్థులను స్కూల్‌కు రానీయకుండా ఓ ప్రైవేటు యాజమాన్యం అడ్డుకున్న ఘటన శ్రీకాకుళంలో వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం డేఅండ్‌నైట్ జంక్షన్‌కు సమీపంలోని ఓ ప్రైవేటు స్కూ ల్‌లో సిద్ధూతోపాటు మరో చిన్నారి చదువుతున్నారు. అయితే తండ్రితోపాటు రెండో తరగతి చదువుతున్న సిద్ధూ అయ్యప్పమాల ధరించాడు. రోజూలానే సోమవారం కూడా సిద్ధూ పాఠశాలకు వెళ్లాడు. యాజమాన్యం ఆ విద్యార్థిని లోపలికి అనుమ తించలేదు. మాలధారణ తీసి వస్తేనే అనుమతిస్తామని ప్రిన్సిపాల్ తెగేసి చెప్పారు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్‌ను అడగ్గా.. తమ పాఠశాలకు మాలధరించి వస్తే అనుమతించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పాఠశాలల్లో ఇదే నిబంధన అమలు చేస్తున్నామని తెలిపారు. ఇదేమి పద్ధతని విద్యార్థి తల్లిదండ్రులు నిలదీయగా.. టీసీ పట్టుకెళ్లిపోవాలని యాజమాన్యం చెప్పింది. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులు భజరంగ్‌దళ్, హిందూ వాద సంఘాలకు తెలియజేశారు. వారు పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. దీనిపై యాజమాన్యాన్ని నిలదీయడంతో ప్రిన్సిపాల్ మాటమార్చే ధోరణి చేపట్టారు. తాము మాల తీసిరమ్మ ని చెప్పలేదని.. మాలధారణతో పాటు పైన యూనిఫాం వేసుకోవాలని చెప్పామని తెలిపారు. చివరకు రేపటి నుంచి మాలధారణ దుస్తులతోనే రావాలని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.