యువగళం పాదయాత్ర ముగింపు సభకు కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యేందుకు వీలుగా వివిధ ప్రాంతాల నుంచి 5 ప్రత్యేక రైళ్లను టీడీపీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా పోలేపల్లిలో జరిగే సభకు 19 తేదీన ఆయా ప్రాంతాల నుంచి రైళ్లు ప్రారంభమవుతాయన్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల కోసం వీటిని ఏర్పాటు చేశామన్నారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
రైళ్ల వివరాలు
1. చిత్తూరు నుంచి బయలుదేరే రైలు (00700/00701) ఉదయం 11.00 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉదయం 11.30 కి పాకాల లో ఆగుతుంది. మధ్యాహ్నం 1.45 కి రేణిగుంట లో ఆగుతుంది.
2. తిరుపతి నుంచి బయలుదేరే రైలు (00702/00703) మధ్యాహ్నం నం 2.00 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.00 కి శ్రీకాళహస్తిలో ఆగుతుంది. మధ్యాహ్నం 3.30 కి వెంకటగిరిలో ఆగుతుంది. సాయంత్రం 4.00 కి గూడూరులో ఆగుతుంది.
3. రైల్వే కోడూరు నుంచి బయలుదేరే ట్రైన్ ఉదయం 7.00కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్ 00704/00705.. రాజంపేటలో ఉదయం 7.30 కి ఆగుతుంది. కడప లో ఉదయం 8.15కి ఆగుతుంది. ప్రొద్దుటూరు లో ఉదయం 9.10 కి ఆగుతుంది. జమ్మలమడుగు లో ఉదయం 9.40కి ఆగుతుంది.
4. ధర్మవరం నుంచి బయలుదేరే ట్రైన్ : 00706/00707 (స్పెషల్ ట్రైన్). ఉదయం 7.00 కి స్టార్ట్ అవుతుంది. అనంతపురం లో ఉదయం 7.45 కి ఆగుతుంది. గుత్తిలో ఉదయం 9.15 కి ఆగుతుంది.
5. నెల్లూరు నుంచి బయలుదేరి ట్రైన్ రాత్రి 8.00 కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్-00712/00713(స్పెషల్ ట్రైన్). కావలి లో 8.30 కి ఆగుతుంది. ఒంగోలులో 9.30కి ఆగుతుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘యువగళం-నవశకం’ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు చంద్రబాబుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ వస్తున్నారు. యువగళం ముగింపు సభ విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో బుధవారం నిర్వహిస్తున్నారు. పోలిపల్లి సభకు బస్సులు కావాలని 2 రోజుల క్రితం ఆర్టీసీని అడిగితే ముందు ఇస్తామన్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. రీజనల్ మేనేజర్లకు సమాచారం ఇస్తామని ఆర్టీసీ ఎండీ చెప్పారని.. ఇప్పుడు ఇవ్వలేమన్నారన్నారు.
అలాగే పలు విద్యా సంస్థ లు, ప్రైవేటు సంస్థలు వారి బస్సులు ఇవ్వడానికి ముందు వస్తే.. వారిని ఆర్‌టీవోల ద్వారా బెదిరిస్తున్నారన్నారు. అయితే సభకు ఎలాగైనా హాజరు కావాలనే లక్ష్యంతో రాయలసీమ నుంచి ఆరు రైళ్లలో అభిమానులు వస్తున్నారన్నారు. మొదట ఈ సభకు ఆంధ్ర వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం అడిగితే ఇవ్వడానికి వీసీ అంగీకరించారని.. ఆ తర్వాత తాజా మాజీ వీసీ ప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీనేతల ఒత్తిళ్లు పెట్టడంతో ఇవ్వలేమన్నారని చెప్పుకొచ్చారు. అందువల్లే పోలిపల్లిలో సభ ఏర్పాటు చేసుకున్నామన్నారు.
ఈ సభకు సుమారుగా ఆరు లక్షల మంది వస్తారని భావిస్తున్నామని.. ఈ సభకు పోలీసు బందోబస్తు కూడా భారీగా అవసరం ఉందన్నారు. ఆ మేరకు సహకరించాలని విజయనగరం జిల్లా ఎస్పీని కోరామరని.. సభ ప్రాంగణంలో 2.5 లక్షల మందికి కుర్చీలు వేస్తున్నట్లు తెలిపారు. ఎల్‌ఈడీ స్ర్కీన్లు పెడుతున్నామని.. టీటీపీ, జనసేన రెండూ సమన్వయం చేసుకుంటున్నాయన్నారు. ఈ సభ నుంచే ఎన్నికల శంఖం పూరిస్తామన్నారు.