అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో దిగ్విజయంగా 100 యాంజియోప్లాస్టీ, 300 యాంజియోగ్రాం శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని చేరుకోవడంతో మంగళవారం అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కియా సీఈఓ డాంగ్‌లిని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు సన్మానించారు. ముందుగా కేక్ కట్ చేశారు. ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలకు సంబంధించి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. వెనుకబడిన అనంతపురం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఏడు విభాగాల్లో స్పెషలిస్ట్ వైద్యులతో సేవలు అందిస్తున్నామన్నారు. ప్రధానంగా కార్డియాలజీ, న్యూరోసర్జరీ విభాగాలు అందుబాటులోకి రావడం వల్ల నిరుపేదలకు ఉపయుక్తంగా మారిందని తెలిపారు. ఆయా విభాగాల హెచ్‌ఓడీలు డాక్టర్ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ భాస్కర్‌లను ప్రత్యేకంగా అభినందించారు.