విజయనగరం జిల్లా పోలిపల్లిలో బుధవారం మధ్యాహ్నం జరగనున్న యువగళం పాదయాత్ర ముగింపు సభకు జిల్లా నుంచి పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు, అభిమానులు ప్రజలు తరలివెళ్లనున్నారు.ఈ మేరకు రవాణా ఇబ్బందులు కలగకుండా పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జిలు బోనెల విజయచంద్ర, గుమ్మిడి సంధ్యారాణి, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో అనేక వాహనాలను సిద్ధం చేశారు. వాటి ద్వారా పార్టీ శ్రేణులు ముగింపు సభకు హాజరై.. తిరిగి ఇళ్లకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్సీలు శత్రుచర్ల విజయరామరాజు, ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యేలు బొబ్బిలి చిరంజీవులు, ఆర్పీ భంజ్దేవ్తో పాటు 15 మండలాల నుంచి టీడీపీ శ్రేణులు ముగింపు సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై ప్రసంగించనున్నారు ఎన్నికల శంఖారావం కూడా పూరించనున్న నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణులు కూడా యువగళం ముగింపు సభకు తరలివెళ్లేందుకు సన్నద్ధమయ్యారు.