ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఓ యువకుడిపై గ్రామస్థులు దాడి చేశారు. అతన్ని చితకబాది మార్కాపురం రూరల్ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. బీహార్‌కు చెందిన వ్యక్తి రైలెక్కి మార్గాపురం వచ్చాడు. రైల్వేస్టేషన్‌లో రెండు రోజుల నుంచి తిరుగుతూ మంగళవారం అక్కడే ఉన్న ఓ బాలుడిని పట్టుకున్నాడు. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు చెడ్డీ గ్యాంగ్ సభ్యుడన్న అనుమానంతో అతడ్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత కాళ్లు చేతులు కట్టేసి మార్కాపురం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం అందుకున్న ట్రైనింగ్ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్, సీఐ వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై ఎం.వెంకటేశ్వరనాయక్ సంఘటనాస్థలానికి చేరుకుని బాధితుడితో పాటు చుట్టుపక్కల వారిని ప్రశ్నించారు. బీహార్ వాసి పేరు, ఇతర వివరాలు కూడా చెప్పలేకపోయాడు. అతనికి మతిస్థిమితం లేదని పోలీసులు గుర్తించి, అనంతరం వదిలిపెట్టారు. చెడ్డీ గ్యాంగ్ సభ్యుడన్న అనుమానంతోనే దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. బాలుడ్ని పట్టుకోవడంతో అనుమానం వచ్చిందంటున్నారు. పాపం అమాయకుడిపై దాడి చేశారని స్థానికులు చర్చించుకున్నారు.