అవయవ దానం చాలా గొప్ప విషయం.. తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే అద్భుతమైన అవకాశం. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ పెద్దాయన చనిపోగా.. ఆ కుటుంబం అవయవదానం చేసి నలుగురికి బతుకునిచ్చింది. టెక్కలి మండలం రావివలసకు చెందిన పొట్నూరు రాజేశ్వరరావును కుటుంబ సభ్యులు ఈ నెల 14న శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి.. మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడంతో రక్తస్రావమై పరిస్థితి విషమించి బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు.
ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగారు. ఆ దుఃఖంలో కూడా గొప్ప మనసుతో ఆలోచించారు. రాజేశ్వరరావు అవయవదానానికి అంగీకరించారు. ఆ మేరకు ఆసుపత్రి యాజమాన్యం జీవన్‌దాన్‌ను సంప్రదించారు. వెంటనే అనుమతి లభించడంతో బుధవారం ఆయన గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కళ్లను వేరు చేశారు. కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్, పోలీసు అధికారుల చొరవతో గ్రీన్ ఛానల్ ద్వారా వాటిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జెమ్స్ యాజమాన్య ప్రతినిధులు పక్కా ప్రణాళికతో గుండెను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి, హైదరాబాద్‌కు ఊపిరితిత్తులు, విశాఖలోని పినాకిల్ ఆసుపత్రికి కాలేయం, రెండు కళ్లను రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించారు.
జెమ్స్ ఆసుపత్రిలో గతంలో ముగ్గురి అవయవదానాలను విజయవంతంగా నిర్వహించారు. ఆ అనుభవంతో ఈ సారి కూడా అవయవాలను సకాలంలో గమ్యస్థానాలకు చేర్చింది ఆస్పత్రి. రాజేశ్వరరావు మృతదేహానికి జెమ్స్ వైద్యులు, నర్శింగ్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. భార్య నిర్మల, కుమారులు తిరుపతిరావు, తేజేశ్వరరావు, కుటుంబసభ్యులు రోదించారు. ఇంటిపెద్ద ఇకలేరనే బాధను దిగమింగుకుంటూనే సాగనంపారు. కుటుంబ సభ్యులు సైతం వైద్యుల సూచన మేరకు అవయవదానానికి ముందుకు వచ్చి పుట్టెడు శోకంలోనూ ఔదార్యాన్ని చాటుకున్నారు.
జెమ్స్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు మొత్తం నలుగురు బ్రెయిన్ డెడ్ పేషంట్ల నుంచి అవయవదానం చేశారు. 30 రోజుల వ్యవధిలోనే ముగ్గురు అవయవదానాలు చేయడం గొప్ప విషయం. ఏడు నెలల క్రితం కిరణ్ చంద్ అనే 14 యేళ్ళ బాలుడుకి, గత నెల 26న మౌనిక అనే 25 ఏళ్ల సచివాలయ ఉద్యోగినికి, మంగళవారం రాజేశ్వర రావు అవయవదానం చేశారు. ఇటీవలి కాలంలో చాలామంది ఇలా అవయవదానం చేయడానికి ముందుకొస్తున్నారు.. తమవాళ్లు ఎలాగూ దక్కరనే విషయం తెలిసి.. అంతటి విషాదంలోనూ మానవత్వంతో ఆలోచిస్తున్నారు. ఇలా మంచి మనసుతో ఆలోచించే ప్రతి ఒక్కరికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.