ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నామని, సీఐటీయూ అనుబంధ సంఘాల మద్దతుతో డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కొవ్వూరు అధ్యక్షురాలు సీహెచ్ మాణిక్యమ్మ తెలిపారు. కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె గురువారం 10వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా ఆర్డీవో కార్యాలయం నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వరకు భిక్షాటన చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. మాణిక్యమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు లక్షల్లో వేతనాలు తీసుకుంటూ, కష్టపడి పనిచేస్తున్న అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని కోరితే కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడాన్ని అంగన్వాడీ రాష్ట్ర, జిల్లా కమిటీలు ఖండిస్తున్నాయన్నారు. అంగన్వాడీల సమ్మెకు మాల మహాసభ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు బొంతా శ్యాం రవిప్రకాష్, పీవోడబ్ల్యు నాయకురాలు ఈమని మల్లిక, పెనుమాక జయరాజులు మద్దతు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలుకొట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వసంతాడ శ్రీదేవి, చీర దుర్గాభవాని, బొందలపాటి పద్మజ, ఆల మండ నరసమాంభ, నేతల శాంతకుమారి, వేలంగి మదురవల్లి, దుమ్మ అమరావతి, ఆర్.జ్యోతి, కె.భాస్కరం, జక్కల మణి పాల్గొన్నారు.