అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ.. "సోనియా అయోధ్య ప్రారంభోత్సవానికి వెళ్లడంపై సానుకూలంగా ఉన్నారు. ఆమె ప్రారంభోత్సవానికి వెళ్తారు. వీలుకాకపోతే ఆమె తరఫున ఓ ప్రతినిధి వేడుకకు హాజరవుతారు" అని అన్నారు. దిగ్విజయ్ కి ఆహ్వానం అందిందా అన్న విషయంపై మాట్లాడుతూ.. "బీజేపీ నన్ను ఆహ్వానించదు. ఎందుకంటే వారు నిజమైన భక్తులను గుర్తించరు. నాతోపాటు మురళీ మనోహర్ జోషి, లాల్ కృష్ణ అద్వానీలకు కూడా ఆహ్వానం అందలేదు" అని విమర్శించారు. జనవరి 22న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠపన కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ప్రముఖులతో సహా చాలా మంది ప్రజలు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు ఆహ్వానం పంపారు. నిర్మాత మహావీర్ జైన్‌తో పాటు నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకులు రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ, రోహిత్ శెట్టి వంటి ప్రముఖులకూ ఆలయ అధికారులు ఆహ్వానాన్ని పంపారు.