దేశంలోని యువత ఉద్యోగాలు లేక, నిరుద్యోగిత కారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లలో ఎక్కువ సమయం తలమునకలవుతున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్యం మరో ప్రశ్నను కూడా లేవనెత్తిందని, ఈ తరహా నిరసనలకు కారణమేమిటనేదే ఆ ప్రశ్న అని, దేశంలోని నిరుద్యోగితే ఈ ప్రశ్నకు సమాధానమని ఆయన చెప్పారు. 'ఇండియా' (I.N.DI.A.Z) కూటమి పార్టీలు జంతర్ మంతర్ వద్ద శుక్రవారంనాడు జరిపిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని నిరుద్యోగితపై మీడియా మాట్లాడటం లేదని, కానీ, సస్పెండైన ఎంపీలు పార్లమెంటు బయట చేసిన నిరసనను వీడియో తీసినందుకు తనను (రాహుల్‌ను) ప్రశ్నిస్తోందని అన్నారు. ''ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పార్లమెంటులోకి ప్రవేశించి పొగ వదలిగారు. దీంతో బీజేపీ ఎంపీలు పరుగులు తీశారు. ఈ ఘటనలో భద్రతా ఉల్లంఘన అనే ప్రశ్న తలెత్తింది. అసలు యువకులు ఈ తరహాలో ఎందుకు నిరసన తెలపాల్సి వచ్చిందనే మరో ప్రశ్న కూడా ఉంది. దేశంలో నిరుద్యోగితే ఇందుకు కారణం'' అని రాహుల్ అన్నారు.