ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం,,,,ఆఫ్‌లైన్ టికెట్లు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 07:17 PM

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. అయితే ముందుగానే అలిపిరి వద్ద వైకుంఠ ఏకాదశి రద్దీ మొదలైంది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 9 కేంద్రాల ద్వారా టీటీడీ టోకెన్లు జారీ చేస్తున్నారు. మొత్తం 4,23,500 వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పూర్తి అయ్యేవరకు నిరంతరాయంగా జారీ చేయనుంది టీటీడీ. శనివారం వేకువజామున 1.45 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా, ఎల్లుండి 24న ద్వాదశి. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథం, ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణి లో చక్రస్నానం నిర్వహిస్తారు. రేపటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. జనవరి 1వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది.


తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం, గోవింద‌రాజ‌స్వామి స‌త్రాలు, భూదేవి కాంప్లెక్స్‌, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవ‌కోన హైస్కూల్‌, బైరాగిప‌ట్టెడ‌లోని రామానాయుడు హైస్కూల్‌, ఎంఆర్ ప‌ల్లిలోని జెడ్పీ హైస్కూల్‌‌లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈ టికెట్లను జారీ చేస్తారు. టోకెన్ల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది టీటీడీ. వైరస్ వ్యాప్తి కారణంగా మాస్క్ ధరించాలని టీటీడీ ఇప్పటికే భక్తులకు సూచిస్తోంది. భక్తులకు ఆహారం, నీటి సౌకర్యంతో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ కేంద్రాలకు సైతం భక్తులు ముందుగానే తరలి వచ్చారు. రద్దీ నేపథ్యంలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద జారీ చేసే టికెట్ కేంద్రాన్ని అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పరిశీలించారు. భక్తులు సంయమనం పాటించాలని కోరారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్‌ ఉంటేనే దర్శనానికి అనుమతిస్తారు. లేకుంటే లేదు. అలాగే.. దర్శనం స్లాట్ సమయానికి 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. దర్శనం‌ టోకెన్, టిక్కెట్టు ఉన్నవారికి అద్దెగది కేటాయిస్తారు. ఇక స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే వీఐపీ దర్శనాలు ఉంటాయి. సిఫార్సు లేఖలు రద్దు చేశారు. అలాగే.. తిరుమలలో వసతి కొరత కారణంగా తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు చేసుకోవాలని వీఐపీలకు టీటీడీ సూచిస్తోంది. కాకపోతే దర్శన టోకెన్‌ ఉన్నవాళ్లకు తిరుమలలో వసతి కేటాయిస్తోంది.


వైకుంఠద్వార దర్శనం టోకెన్లను ఓర్పుతో, అంకితభావంతో భక్తులకు అందజేయాలని తిరుప‌తిలోని కౌంటర్లలో విధులు కేటాయించిన నోడల్ అధికారులకు, సిబ్బందికి జేఈవో సదా భార్గవి సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో 400 మంది డెప్యుటేషన్ సిబ్బందిని ఉద్దేశించి జెఈవో మాట్లాడారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనం కోసం దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు నాలుగు లక్షలకుపైగా టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా సిబ్బంది విధులు నిర్వ‌హించాల‌ని కోరారు. భక్తులకు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు త‌దిత‌ర సౌకర్యాలను ఆయా కేంద్రాల్లోని నోడల్ అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. భ‌క్తుల ఆధార్ కార్డును ధ్రువీక‌రించుకుని తేదీల వారీగా వ‌రుస క్ర‌మంలో టోకెన్లు మంజూరు చేయాల‌ని, తేదీలు, స్లాట్లు మార్చుకునే అవ‌కాశం లేద‌ని వివ‌రించారు. త‌హ‌సీల్దార్లు, పోలీసులు క్యూలైన్ల‌లో భ‌క్తుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తార‌ని తెలిపారు. మొత్తం టోకెన్లు పూర్త‌య్యే వ‌ర‌కు అన్ని కౌంటర్లలో నిరంతరాయంగా జారీ చేస్తార‌ని చెప్పారు. ఐటీ జిఎం సందీప్‌ పవర్‌పాయింట్ ప్ర‌జెంటేషన్‌ ద్వారా టోకెన్ల కేటాయింపు విధానాన్ని డెప్యుటేషన్‌ సిబ్బందికి వివరించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com