ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో.. రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేనతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా బరిలో ఉన్నాయి. వీటికి తోడు మేము కూడా బరిలో దిగుతామంటూ కొత్త పార్టీలు కూడా పురుడుపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్డి.. కొత్త పార్టీని ప్రకటించారు. "తెలుగు సేన పార్టీ" పేరుతో సత్యారెడ్డి కొత్త పార్టీని స్థాపించారు. అయితే.. ఆయన పార్టీని ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. మరో కొత్త పార్టీ కూడా ప్రకటనకు సిద్ధమైందన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే.. కొత్త పార్టీని పెడుతుంది ఎవరో కాదు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
"జై భారత్ పార్టీ" పేరుతో లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్‌లో ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు పార్టీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. గతేడాదే పార్టీ పేరును లక్ష్మీనారాయణ ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీ చేస్తానని పలు వేదికలపై బహిరంగంగానే ప్రకటించారు. తొలుత ఆయన మళ్లీ జనసేన పార్టీలో చేరి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ.. ఆయనే సొంతంగా పార్టీ పెట్టబోతున్నారన్న వార్త ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.