తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మరో సింహం మృతి చెందింది. ప్రస్తుతం చనిపోయిన సింహం వయసు 23 ఏళ్లని.. వృద్ధాప్యం కారణంగా మృతిచెందినట్లు క్యూరేటర్ సెల్వం తెలిపారు. గతవారం ఒక సింహం చనిపోగా.. ఇప్పుడు మరో సింహం మృతి చెందింది.వరుస సింహాల మరణాలతో జూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటీవల జన్యు సంబంధిత కారణాలతో అనురాగ్ అనే సింహం మృతిచెందిన సంగతి తెలిసిందే.
నాలుగు రోజుల క్రితం ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అనురాగ్ అనే మగ సింహం చనిపోయింది. ఏడేళ్ల క్రితం జూ పార్క్ లోనే మూడు సింహాలు పుట్టాయి. ఆ మూడు సింహల్లో ఒకటైన మగ సింహానికి అనురాగ్ అనే పెట్టారు. ఇది పుట్టినప్పటి నుంచి జన్యుపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతోంది. వయసుకు తగ్గ బరువు, పొడవు లేకపోవడం, కుడి కంటి చూపు కోల్పోవడం, ఇతర అనారోగ్య సమస్యల వల్ల దాన్ని ప్రదర్శనకు ఉంచలేదని జూ అధికారులు తెలిపారు. చిన్నతనం నుంచి వైద్య సేవలను జూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందిస్తున్నా కోలుకోలేక పోయిందని చెప్పారు. గత వారం రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది అనురాగ్ కు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవ్వడంతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అనురాగ్ ను ఖననం చేసినట్లు స్పష్టం చేశారు. సాధారణంగా సింహాలు 15-20 ఏళ్లు జీవిస్తాయని అధికారులు చెబుతున్నారు.