జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలో భద్రతా బలగాలపై ముష్కరులు చేసిన దాడిలో ఐదుగురు భారత జవాన్లు అమరులైన ఘటన యావత్ భారత దేశాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఇలాంటిదే రెండో దాడి జరగడంతో భద్రతా బలగాలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే పూంఛ్ సెక్టార్ వెంబడి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. అడుగడుగునా పటిష్ఠ బందోబస్తుతో గాలింపు ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఈ దాడి చేసింది తామే అని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ వెల్లడించింది. ఈ క్రమంలోనే పాక్, చైనా కలిసి ఈ దాడులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయా అనే అనుమానం రక్షణ శాఖ వర్గాలకు వచ్చింది. మరోవైపు.. పూంఛ్ సెక్టార్‌లో దాదాపు 25 నుంచి 30 మంది పాక్ ముష్కరులు నక్కినట్లు భారత సైన్యం అంచనా వేస్తోంది. దీంతో వారి ఆచూకీ కనిపెట్టేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది.
పూంఛ్ జిల్లాలోని ధేరా కి గాలి, బుఫ్లియాజ్ ప్రాంతాల మధ్య గల ధత్యార్ మోర్ వద్ద గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు భారత సైనికులు వెళ్తున్న వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన సైన్యం.. ఎదురు కాల్పులు జరపగా.. ఉగ్రవాదులు పరారయ్యారు. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘటన తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. అయితే పక్కా ప్రణాళికతోనే ముందస్తు రెక్కీ నిర్వహించి.. ప్రమాదకరమైన మూలమలుపు వద్ద కొండల్లో దాగి ఉండి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం తూర్పు లఢఖ్‌లోని సరిహద్దుల్లో భారత్ - చైనా బలగాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇరు దేశాలు, సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయ్యాయి. ఆ ఉద్రిక్తతలు ఇప్పటికీ చల్లారలేదు. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో చైనా బలగాలను దీటుగా ఎదుర్కొనేందుకు పూంఛ్ సెక్టార్ నుంచి రాష్ట్రీయ రైఫిల్స్‌ను లఢఖ్‌కు తరలించారు. అయితే అదే అదనుగా భావించిన పాకిస్థాన్.. తమ ఉగ్రవాదులను పూంఛ్ సెక్టార్‌లోకి పంపించడం ప్రారంభించింది. ఈ మార్గం గుండా వచ్చిన ఉగ్రవాదులు ఇటీవల భారత సైన్యంపై దాడులకు తెగబడుతున్నారు.
ఈ క్రమంలోనే లఢఖ్‌లో మోహరించిన భారత సైన్యాన్ని కాశ్మీర్‌కు మళ్లించడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోంది. దీని కోసం పాక్ - చైనాలు సహకరించుకుంటూ పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నాయని రక్షణ శాఖ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పూంఛ్ జిల్లాలోని అడవిలో ప్రాంతంలో 30 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భావిస్తున్నాయి. దీంతో వారి జాడను పసిగట్టేందుకు స్నిఫర్ డాగ్‌లు, డ్రోన్ల సాయంతో గాలింపు ఆపరేషన్లు చేపట్టాయి. పూంఛ్ సెక్టార్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ తోపాటు ఇతర బృందాలు అక్కడికి చేరుకున్నాయి.