ఏపీలో చలి తీవ్రత పెరిగింది.. రాత్రి 10 గంటల నుంచే ప్రభావం కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉదయం 9 తర్వాత కూడా మంచు వీడటం లేదు. వారం రోజులుగా ఉత్తరాంధ్రలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. రాయలసీమలో నంద్యాల, కర్నూలు జిల్లాల్లో చలిపులి పంజా విసురుతోంది. గురువారం అత్యల్పంగా.. అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో 5.6 డిగ్రీలు, జి.మాడుగులలో 6.1 డిగ్రీలు, అరకులో 6.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలోని అధిక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉంటున్నాయి.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో 10 డిగ్రీల నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోస్తాలోని ఏలూరు, నంద్యాల, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల 14 డిగ్రీల నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఉత్తరాంధ్రలో సాధారణం కంటే రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండగా రాయలసీమలో 2.7 డిగ్రీల మేర పెరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకులోయ, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 8.3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రోజుల వ్యవధిలోనే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో గిరిజనులు వణికిపోయారు.
పాడేరు మండలం మినుములూరులో 11డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటలకు కూడా మంచు తెరలు అలుముకుంటున్నాయి. చింతపల్లితో పాటు లంబసింగి, గూడెంకొత్తవీధి ప్రాంతాల్లో ప్రయాణికులు కూడా చలి తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఒంగోలు, కర్నూలు, మచిలీపట్నంలలో 30.5 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో గురువారం 7.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ప్రధానంగా ఒడిశా మీదుగా వీచిన గాలులతో ఉత్తర కోస్తాలో చలి పెరిగింది. అయితే ఈ ఏడాది అకాల వర్షాలు, తుఫాన్లు కారణంగా ఇప్పటివరకు పది కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకాలేదు. డిసెంబర్‌లోనే పరిస్థితి ఇలా ఉందంటే.. జనవరిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు. అలాగే చలి దెబ్బకు పిల్లలు, పెద్దవాళ్లు ఇబ్బందిపడుతున్నారు.. బయటకు రావాలంటే ఆలోచిస్తున్నారు.