ఏపీలో కార్తీక మాసం తర్వాత ధనుర్మాసం కావడంతో ఆలయాలకు భక్తులు వెళుతున్నారు. రద్దీ పెరగడంతో దొంగల ఫోకస్ ఆలయాలపై పడింది. సందట్లో సడేమియా అన్నట్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భక్తుల విలువైన వస్తువుల్ని ఎత్తుకెళుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో ఇదే జరిగింది. అయితే ఈ చోరీ సీన్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది. తెనాలిలోని గంగానమ్మపేట శివాలయం దగ్గర దొంగలు రెక్కీ చేసి చోరీలు చేస్తున్నారు. ఆలయం ముందు పార్క్ చేసిన బైక్‌ల నుంచి డబ్బులు, మొబైల్స్, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇటీవల అరటి పళ్ల వ్యాపారి బైక్‌లో రూ.40వేలు ఉన్నాయి. ఆయన హడావిడిగా వచ్చి గుడి బయట బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. పూజ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత చూస్తే బైక్‌లో ఉంచిన డబ్బులు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో అయ్యప్ప భక్తుడు బైక్ కవర్‌లో మొబైల్ ఉంచి.. లోపలికి వెళ్లి వచ్చే లోపే మాయం అయ్యింది. మరో భక్తుడి బైక్ మాయమైంది. ఇలా వరుస ఘటనలతో భక్తులు ఆందోళనలో ఉన్నారు. భక్తులు హాడావుడిగా వచ్చి బైక్ పార్క్ చేసి ఆలయంలోకి వెళ్లిన సమయంలో దొంగలు వస్తువుల్ని చోరీ చేస్తున్నారు.
ఇదే ఆలయం దగ్గర ఇటీవల ఓ వ్యక్తి బైక్ డిక్కీ ఓపెన్ చేస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనుమానంతో అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ చెక్ చేస్తే బైక్ డిక్కీలను ఓపెన్ చేయడాన్ని గుర్తించారు. నకిలీ తాళాలతో డిక్కీలు ఓపెన్ చేస్తున్నట్లు తేల్చారు. ఇలా వరుసగా చోరీలు జరుగుతున్నాయని.. ఆలయాల దగ్గర నిఘా పెంచితే బావుంటుంది అంటున్నారు. ఆలయానికి వస్తున్న భక్తులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.