చంద్రబాబు కొడుకు లోకేశ్ కొద్దికాలం కిందట యువగళం పేరిట కుప్పంలో ఆర్భాటంగా పాదయాత్ర ప్రారంభించాడు. ఆ యాత్ర ఎలా సాగిందో ప్రజలంతా చూశారు అని మాజీ మంత్రి పేర్ని నాని తెలియజేసారు. అయన మాట్లాడుతూ...... సహజంగా రాజకీయాల్లో ఏ నాయకుడైనా పాదయాత్ర చేపడితే ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో చిత్తశుద్ధితో చేస్తాడు. యాత్రలో ప్రజల సమస్యల్ని, వారి బాధల్ని ఆలకిస్తూ.. వాటి పరిష్కారానికి మదిలోనే ఆలోచన చేస్తూ అందరితో మమేకమవుతూ ముందుకు సాగుతోంటారు. అయితే, ఈ లోకేశ్ యాత్ర మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా సాగింది. పాపపు సొమ్ముతో అక్కడక్కడ బహిరంగ సభల పేరిట జనాల్ని డబ్బులిచ్చి అక్కడకు తరలించుకు రావడం.. జగన్‌మోహన్‌రెడ్డి గారిని బూతులు తిట్టడం.. మళ్లీ అక్కడ్నుంచీ పరిగెట్టడం.. అందరూ చూసిన సంగతే. ఈయనేమో నవ యువకుడంట.. ఈయన చేసేది యువగళం యాత్రంట. సాయంత్రం ఐదు గంటలైతేనే గానీ బస్సులో నుంచి బయటకు రాడంట. సూర్యుడు అస్తమించగానే ఈయన రోడ్డు మీదికి వస్తాడంట. నేలమీద అడుగు పెట్టగానే.. యూట్యూబ్‌లో వీడియోలాగా పరిగెడతాడు. లోకేశ్ ఎక్కడున్నాడయ్యా..? అని ఎవరైనా అడిగితే, విజయవాడ పడమట సెంటర్‌లో ఉన్నాడంటారు. రాత్రి 10 గంటలకే ఏలూరులో తేలతాడు. ఆ సాయంత్రం మరలా ఏలూరులో సభ పెడతాడు. ఇది ఆయన చేసిన పాదయాత్ర తీరు. మరి, దీన్ని ఏమనాలి..? అది పాదయాత్ర కాదు. ఇది కచ్చితంగా జంపింగ్.. జపాంగ్ యాత్రనే అంటారు అని అన్నారు.