మృత్యువు ఏ రూపంలో వస్తుందో అస్సలు ఊహించలేము. అప్పటి వరకు సరదాగా గడిపినవారు కూడా ఆకస్మాత్తుగా అనుకోని ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతుంటారు. చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం అవిలాల గ్రామంలోనూ అలాంటే ఘటనే చోటు చేసుకుంది. సాయం చేసేందుకు వెళ్లిన ఓ యువకుడిని మృత్యువు కబళించింది. వివరాల్లోకి వెళితే.. లింగేశ్వరనగర్‌కు చెందిన తనుష్ కుమార్ (18) ఇంటర్ చదువుతున్నారు. శనివారం సాయంత్రం క్రికెట్ ఆడేందుకు అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు సాయి, భానుతో కలిసి ఓ లే అవుట్‌లోని గ్రౌండ్‌కు వెళ్లారు. వారు సరదాగా ఆడుకుంటుండగా.. సమీపంలో నివాసం ఉంటున్న నాగరాజరెడ్డి కొద్దిసేపటికి వారి వద్దకు వచ్చాడు. రేకులు మేడపైకి తీసుకెళ్లడానికి సాయం పట్టాలని కోరారు. వయసులో పెద్దవాడు సాయం అడగటంతో కాదనకుండా ముగ్గురు యువకులు వెళ్లారు.
20 అడుగుల నీలిరంగు ఇనుప రేకును సాయి, తనుష్ కుమార్ నిలబెట్టి పైకి ఎత్తగా.. మొదటి ఫ్లోర్‌లో భానుతోపాటు ఇంటి యజమాని నాగరాజురెడ్డి పట్టుకుని పైకి లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారు రేకును సక్రమంగా లాగలేకపోవడంతో అది జారి ఇంటి ముందున్న 11 కేవీ విద్యుత్తు తీగలను తాకింది. కింద వాటిని పట్టుకున్న ఇద్దరు యువకులు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అందులో తనుష్ కుమార్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. సాయి చెప్పులు వేసుకోవడంతో షాక్‌కు గురై పక్కన పడిపోయాడు. అతడు కూడా గాయాలకు గురికావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.