ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి రోజా తన పెద్దమనసు చాటుకున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా శాంతాక్లాజ్ వేషంలో ఓ పేద కుటుంబానికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. విజయవాడ వాంబే కాలనీలో ఉండే నాగరాజు రోడ్డు మీద చెప్పులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. దివ్యాంగుడైన నాగరాజుకు భార్యా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు . అయితే నాగరాజు భార్యకి కిడ్నీలు పాడయ్యాయి. ఇటీవలే వైద్యులు ఓ కిడ్నీని తొలగించారు. భార్య చికిత్స కోసం నాగరాజు తను దాచుకున్న సొమ్ము మొత్తం ఖర్చుచేశాడు. దీంతో ఇల్లుగడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ తోనే బతుకు బండిని లాగిస్తూ వస్తున్నారు.
అయితే నాగరాజు పరిస్థితిని ఓ విలేఖరి మంత్రి రోజాకు వివరించారు. అతని పరిస్థితిపై ఓ వీడియోను రోజా ట్విటర్‌కు షేర్ చేశారు. విలేకరి అభ్యర్థన మీద స్పందించిన రోజా.. ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం.. నాగరాజు ఇంటికి క్రిస్మస్ తాత వేషంలో వెళ్లారు. నాగరాజు పిల్లలను బహుమతులు తీసుకెళ్లి వారిని సర్‌ప్రైజ్ చేశారు. సీఎం జగన్ పుట్టినరోజును నాగరాజు కుటుంబంతో కలిసి జరుపుకున్న మంత్రి రోజా.. ఆ కుటుంబానికి రెండులక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా తనని సంప్రదించాలంటూ భరోసా ఇచ్చారు.