విజయవాడ పోలీసులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. క్రిస్మస్ సందర్బంగా ఉచిత బహుమతులు వచ్చాయంటూ ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే నమ్మొద్దని హెచ్చరించారు .అపరిచిత వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీ చెప్పకూడదని.. సైబర్ నేరాల పట్ల అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలి సూచించారు విజయవాడ పోలీసులు. క్రిస్మస్ సీజన్ కావడంతో కొందరు సైబర్ కేటుగాళ్లు బహుమతుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాల పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని విజయవాడ పోలీసులు అలర్ట్ చేశారు. ఆరోగ్యశ్రీ, గృహ కల్ప, పెన్షన్, బీమా, విద్యా కానుక, అమ్మ ఒడి, వసతి దీవెన, చేయూత వంటి పథకాల పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు రావాలంటే.. ముందుగా తమ దగ్గరనమోదు చేసుకోవాలని కొందరు ఫోన్లు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ పథకాలతో పాటు త్వరలో రానున్న ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారని నమ్మిస్తారన్నారు. పథకాలు రావాలంటే ముందు కొంత మొత్తం చెల్లిస్తే సరిపోతుందని.. డబ్బులు చెల్లించమంటారన్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్‌ను నమ్మొద్దు .. మోసపోవద్దని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అవగాహనతో పాటుగా అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేయాలని సూచించారు విజయవాడ పోలీసులు.