అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళలోని శబరిమలకు వెళ్తున్న భక్తుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఎరుమేలిలో స్వాముల వాహనాలను కొద్ది గంటలుగా పోలీసులు నిలిపివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. శబరిమళకు వెళ్లే అయ్యప్ప స్వాముల వాహనాలను గంటల కొద్దీ పోలీసులు నిలిపివేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన స్వాములు, భక్తులు రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసు సిబ్బంది స్పందించక పోవడంతో శబరిమలై నుంచి తిరిగి వెళ్లే వాహనాలను స్వాములు అడ్డుకుని ధర్నా చేస్తున్నారు. మరోవైపు, అయ్యప్పస్వామి దర్శనం కోసం గతంలో ఎన్నుడూలేని విధంగా శబరిమలకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో పంబ నుంచి సన్నిధానం వరకూ క్యూలైన్‌లు నిలిచిపోయి.. భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేరళ ప్రభుత్వం, పోలీసులు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.
మరో మూడు రోజుల్లో మండల పూజలు ముగియనుండగా.. భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. స్వాముల రాకతో శబరిగిరులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులను నియంత్రించడానికి పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎరుమేలిలో భక్తులను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఎరుమేలి నుంచే పంప మీదుగా శబరియాత్ర మొదలవుతుంది. దీంతో అక్కడే భక్తులను నియంత్రిస్తున్నారు. శనివారం 97 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్రకారం.. డిసెంబరు 23 వరకూ 25,69,671 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్పాట్ బుకింగ్‌లు రోజుకు 10 వేలు ఉండగా.. వాటిని 15 వేలకు పెంచాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. రద్దీని తగ్గించే ప్రయత్నంలో డిసెంబర్ 26, 27 తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్‌ను వరుసగా 64,000, 70,000లకు పరిమితం చేసింది. అయితే వర్చువల్ క్యూ బుకింగ్‌ల జనవరిలో 80,000కి చేరుకుంటుంది.