రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా - డబ్ల్యూఎఫ్ఐ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా మాజీ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నిక కావడం మరోసారి రెజ్లింగ్ ఫెడరేషన్‌లో అలజడి నెలకొంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు రెజ్లర్లు తమ పతకాలను వెనక్కి ఇచ్చేయగా.. స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఏకంగా రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా సంజయ్ సింగ్ ఎన్నికపై బ్రిజ్ భూషణ్ స్పందించారు. తాను రెజ్లింగ్ నుంచి దూరమైనట్లు.. ఇప్పుడు తనకు రెజ్లింగ్ ఫెడరేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ కొత్త బాడీని సస్పెండ్ చేస్తూ తాజాగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను బ్రిజ్ భూషణ్ కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బ్రిజ్ భూషణ్.. తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగాయని.. ఇప్పుడు అన్ని విషయాలు కొత్త ఫెడరేషన్ చూసుకుంటుందని బ్రిజ్ భూషణ్ చెప్పారు. ఈ సందర్భంగానే ఇటీవల డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా ఎన్నికైన సంజయ్ సింగ్ తనకు సన్నిహితుడు అంటూ వస్తున్న వార్తలను బ్రిజ్ భూషణ్ ఖండించారు. సంజయ్ సింగ్ తనకు ఏమీ బంధువు కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రెజ్లింగ్ నేషనల్స్‌ను కనీసం ఢిల్లీలోనైనా జరపాలని తాను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రెజ్లర్లు ఈ ఏడాది నష్టపోరని వెల్లడించారు.
ఇక సంజయ్ సింగ్ అధ్యక్షతన డబ్ల్యూఎఫ్ఐ కొత్త బాడీ గత గురువారం ఏర్పడింది. ఆ వెంటనే అండర్-15, అండర్-20 నేషనల్స్‌ను ఉత్తర్‌ప్రదేశ్ గోండాలోని నందిని నగర్‌లో ఈ నెలాఖరులో ఏర్పాటు చేస్తామని సంజయ్ సింగ్ ప్రకటించారు. అయితే ఇది తొందరపాటు నిర్ణయమని.. రెజ్లర్లకు అవసరమైన గడువు ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని క్రీడా శాఖ ఆదివారం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ క్రమంలోనే కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ బాడీని సస్పెండ్ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ డిసెంబర్ 21 వ తేదీన డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్‌గా ఎన్నిక కావడంపై రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్టు సాక్షి మాలిక్ ప్రకటించగా.. భజ్‌రంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రధానికి లేఖ రాశారు. మరికొంత మంది రెజ్లర్లు కూడా ఇదే రకమైన నిర్ణయాన్ని వెలువరించారు.