భారతదేశ చరిత్రలో ఆరావళి పర్వత శ్రేణి ఒక మౌన సాక్షిగా నిలిచింది. కోట్లాది సంవత్సరాలుగా ఏర్పడిన ఈ పురాతన పర్వత వ్యవస్థ, ఉత్తర భారతదేశానికి సహజ రక్షణ కవచంగా పని చేస్తోంది.కానీ నేడు అభివృద్ధి ముసుగులో మైనింగ్ దోపిడీకి బాధ్యమవుతోంది. ఇది కేవలం పర్యావరణ సమస్యే కాకుండా, ప్రజల జీవన హక్కులపై నేరుగా దాడి.ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఆరావళి పర్వతాలను ఎత్తు (100 మీటర్లు) ఆధారంగా మాత్రమే గుర్తించింది. ఇది ముఖ్య ప్రాంతాలను రక్షణ పరిధి నుంచి తొలగించే అవకాశాన్ని తెచ్చింది. చట్టపరంగా ఇది సాంకేతికంగా సరైనదిగా ఉండవచ్చు, కానీ దీని ప్రభావాలు దేశ భవిష్యత్తుకు గణనీయంగా దెబ్బతీస్తాయి.ఆరావళి కేవలం పర్వత శ్రేణి కాదు, ఒక సజీవ జీవవ్యవస్థ. ఇది రాళ్ల సమూహం మాత్రమే కాదు; భూగర్భ జలాలకు సహజ నిల్వ, ఎడారీకరణను అడ్డుకునే చివరి గోడ, అడవులు, వన్యప్రాణుల నివాసం, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి సహజ గాలి శుద్ధి యంత్రం. భూగోళిక నిర్మాణం, అడవుల విస్తరణ, శిలా స్వభావం, నీటి ప్రవాహం – ఇవన్నీ కలిసేలా ఆరావళిని ఒక జీవవ్యవస్థగా నిలిపాయి.కేవలం ఎత్తు ఆధారంగా ఈ వ్యవస్థను విభజించడం శాస్త్రానికి విరుద్ధం. మైనింగ్ నష్టాలు తాత్కాలికం కాదు. పర్వతాలను పేల్చడం వల్ల శిలా నిర్మాణాలు శాశ్వతంగా ధ్వంసమవుతాయి, భూగర్భ జల ప్రవాహం విఘటించబడుతుంది, అడవులు పునరుద్ధరించలేనీయ విధంగా నశిస్తాయి. “సస్టెయినబుల్ మైనింగ్” అనే భావన కేవలం మిథ్యమే.హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల్లో నీటి కొరత ఇప్పటికే తీవ్రమైంది. మైనింగ్ వల్ల సహజ వ్యవస్థ దెబ్బతింటే, కోట్లాది ప్రజలకు తాగునీటి సమస్య ఎదురవుతుంది. ఆరావళి అడవులు ధూళి, ఇసుక గాలులను అడ్డుకుని సహజ రక్షణ గోడగా పని చేస్తాయి. ఆ గోడను ధ్వంసం చేయడం, కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రభుత్వ ద్వైభావానికి ప్రతీక.ఆరావళి పశ్చిమ రాజస్థాన్ ఎడారి నుండి వచ్చే వేడి గాలులను అడ్డుకునే చివరి అవరోధం. ఈ అవరోధం బలహీనపడితే, ఎడారీకరణ హరియాణా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వైపుకు విస్తరించే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్ తరాలపై శిక్షలాగే ఉంటుంది.ప్రకృతి వనరులను కొద్దిమంది కార్పొరేట్ లాభాల కోసం త్యాగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. నిజమైన అభివృద్ధి అంటే నీటి భద్రత, ప్రజారోగ్యం, పర్యావరణ సమతుల్యత, భవిష్యత్ తరాల భద్రతకు హామీ ఇచ్చే విధంగా ఉండాలి. ఆరావళిని కాపాడటం అంటే దేశపు జీవనాధారాలను కాపాడటం. నిజమైన అభివృద్ధి ఎప్పుడూ పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకు సాగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa