కశ్మీర్‌లో ముష్కర మూకలు కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజుల కిందట సైనిక వాహనాలపై దాడికి తెగబడి ఐదుగురు జవాన్లను ప్రాణాలు తీశారు. తాజాగా, మసీదులో మాజీ పోలీస్ అధికారిని కాల్చి చంపారు. బారాముల్లా జిల్లా గంటముల్లాలో రిటైర్డ్ పోలీస్ అధికారి మహ్మద్ షపీ మిర్‌ను ఆదివారం ఉదయం ముష్కరులు హత్య చేశారు. ఉదయం అజాన్ ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లిన ఆయనపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.
పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత మీర్ స్థానిక ‘ముయెజ్జిన్’ (ప్రార్థనల కోసం పిలిచే వ్యక్తి) అయ్యారు. మసీదులో తన విధులకు ఆయన అంకితమయ్యారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ సంఘటన గురించి షఫీ తమ్ముడు అబ్దుల్ కరీమ్ మీర్ మాట్లాడుతూ.. ‘మా సోదరుడు ఆజాన్ కోసం మసీదుకు వెళ్లేవాడు. అయితే, ఈ రోజు ఉదయం.. ఆజాన్ ప్రార్థనల్లో అకస్మాత్తుగా ఆయన పిలుపు ఆగిపోయింది.. మొదట మైక్రోఫోన్ పని చేయడం ఆగిపోయిందని మేము అనుకున్నాం.. అయితే, తరువాత, దారుణం జరిగిపోయిందని తెలిసి షాక్‌కు గురయ్యాం’ అని అన్నారు.
హత్యకు గురైన మాజీ పోలీసు అధికారి బంధువు ముస్తఫా మీర్ మాట్లాడుతూ.. ఆజాన్ కాల్ మధ్య పెద్ద శబ్దం వినిపించినప్పుడు తాను ఇంట్లో ఉన్నానని, అవి తుపాకీ కాల్పులు కాదా అని ఖచ్చితంగా తెలియలేదని చెప్పాడు. ఆయనను కాల్చి చంపినట్లు తన కుమార్తె ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. అతడి శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయని అన్నారు. మీర్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనను కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ‘ఉగ్రవాదుల ఘాతుకానికి ఐదుగురు జవాన్లు అమరులయ్యారు.. సైన్యం కస్టడీలో ముగ్గురు అమాయకులు చనిపోయారు.. చాలా మంది ఆస్పత్రిలో మృత్యవుతో పోరాడుతున్నారు.. ఇప్పుడు రిటైర్డ్ ఎస్పీని చంపేశారు’ పీడీపీ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు.