దేశంలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండు వారాల నుంచి దేశంలో రోజువారీ కోవిడ్-19 కేసులు పెరుగుతూ ఉన్నాయి. అటు, రాష్ట్రంలోనూ కరోనా కేసులు మెల్లగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోందది. అలాగే, ఈ ఏడాదిలో తొలి కరోనా మరణం మంగళవారం నమోదయ్యింది. కోవిడ్-19తో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. కొద్ది రోజుల కిందట అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.
మృతురాలు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వైద్యలు తెలిపారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అప్పటి నుంచి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కానీ, పరిస్థితి విషమించి ఆమె డిసెంబరు 24న చనిపోయినట్టు పేర్కొన్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అటు, తెలంగాణలోనూ ఈ ఏడాదిలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. ఇతర అనారోగ్య సమస్యలతో ఇటీవల అతడు ఆసుపత్రిలో చేరిన అతడికి.. ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. మరోవైపు, దేశవ్యాప్తంగా కొత్తరకం వేరియంట్ జేఎన్.1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ వేరియంట్ కేసులు 63కి చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, ఏపీలోకి ఈ వేరియంట్ ప్రవేశించినట్టు అనుమానిస్తున్నారు.
అటు, ఏపీలో గడిచిన 24 గంటల్లో 6 కొత్త కేసులు వెలుగుచూశాయి. విశాఖ జిల్లాలో ఐదు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు కోవిడ్ బారినపడ్డారు. వీటితో కలిపి రాష్ట్రంలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే, శ్రీకాకుళం జిలా మెళియాపుట్టి మండాలనికి చెందిన ఓ వృద్ధుడు, శ్రీకాకుళానికి చెందిన మహిళకు, కొత్తూరు మండలంలో మరొకరికి పాజిటివ్ వచ్చినట్లు డీఎంహెచ్‌వో మీనాక్షి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో ఓ మహిళకు కొవిడ్ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో బి.జగన్నాథరావు వెల్లడించారు.
ఓవైపు శీతాకాలం నేపథ్యంలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోవడం వల్ల ఇన్‌ఫ్లూయెంజా సహా కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించారు. అలాగే, అనారోగ్య సమస్యలున్నవారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, ప్రయాణాలు చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించి, తరుచూ చేతులును శుభ్రం చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa